IndiGo: ఇండిగోకు తాత్కాలిక ఊరట..పైలట్ల వారపు విశ్రాంతి గంటలు తగ్గించిన DGCA
IndiGo: నవంబర్ 1 నుంచి అమలవుతున్న ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నియమాలను సవరిస్తూ డీజీసీఏ కీలక ప్రకటన చేసింది.
IndiGo
మూడు రోజులుగా ఇండిగో విమానయాన సంస్థ రద్దు చేస్తున్న వందలాది విమానాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల వల్ల, భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) అత్యవసరంగా రంగంలోకి దిగింది. నవంబర్ 1 నుంచి అమలవుతున్న ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నియమాలను సవరిస్తూ డీజీసీఏ కీలక ప్రకటన చేసింది.
ఇండిగో(IndiGo)తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న తీవ్ర పైలట్ల కొరత కారణంగా 1,100కు పైగా విమానాలు రద్దు కావడంతో, డీజీసీఏ కొన్ని నియమాలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సడలింపులు తాత్కాలికంగా ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడనున్నాయి.
నవంబర్ 1 నుంచి అమలైన కొత్త FDTL ప్రకారం, పైలట్లకు వారానికి తప్పనిసరిగా 48 గంటల విశ్రాంతి ఇవ్వాలి.
డీజీసీఏ ఈ నియమాన్ని మళ్లీ పాత నియమం ప్రకారం 36 గంటలకు తగ్గించింది. అంటే, వారానికి 36 గంటల విశ్రాంతి ఇస్తే సరిపోతుంది. ఇది పైలట్ల లభ్యతను పెంచి, రద్దు అయిన విమానాలను తిరిగి షెడ్యూల్ చేయడానికి సహాయపడుతుంది.

రాత్రి ల్యాండింగ్‌లపై ఆంక్ష ఎత్తివేత.. పైలట్లకు వారానికి గరిష్ఠంగా రెండు రాత్రి ల్యాండింగ్‌లకే (Night Landings) అనుమతి ఉండేది.
ఈ నియమాన్ని డీజీసీఏ పూర్తిగా ఎత్తివేసింది. రాత్రిపూట విమానాల రాకపోకలను పెంచడానికి మరియు ఆలస్యమైన విమానాలను పూర్తి చేయడానికి ఇది ఎయిర్‌లైన్స్‌కు వెసులుబాటు కల్పిస్తుంది.
ప్రయాణికుల భద్రత, పైలట్ల ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి, డీజీసీఏ కేవలం సంక్షోభం తగ్గుముఖం పట్టేంతవరకు మాత్రమే ఈ సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, విమానయాన సంస్థలు తమ సిబ్బందిపై ఎక్కువ ఒత్తిడి తీసుకురాకుండా ఉండేందుకు, డ్యూటీ సమయం 13 గంటలు, వారానికి గరిష్ఠంగా 60 గంటలు ఫ్లైయింగ్ వంటి ఇతర ముఖ్యమైన FDTL నియమాలు యథావిధిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం ఇండిగో(IndiGo)కు పెద్ద ఊరటగా మారింది. పైలట్ల లభ్యత పెరగడంతో..సాంకేతిక సమస్యలు లేని విమానాలను ఇప్పుడు వెంటనే షెడ్యూల్ చేసి, గతంలో రద్దు అయిన విమానాలలో చిక్కుకుపోయిన లక్షలాది మంది ప్రయాణికులకు ఉపశమనం అందించడానికి అవకాశం ఏర్పడింది. అయితే, ఎయిర్‌బస్ ఏ-320 విమానాలకు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు.



