Bharat Taxi
ప్రస్తుతం నగరాల్లో ప్రయాణం అంటే ఓలా, ఉబర్ లేదా రాపిడో వంటి యాప్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే వీటిలో తరచుగా పెరిగే ఛార్జీలు, క్యాన్సిలేషన్ సమస్యలతో ప్రయాణికులు విసిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ ఒక సంచలన ప్రకటన చేసింది.
2026 జనవరి 1 నుంచి భారత్ టాక్సీ (Bharat Taxi)అనే సరికొత్త రవాణా సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది కేవలం ప్రయాణికులకే కాదు, వేలాది మంది ట్యాక్సీ డ్రైవర్లకు కూడా పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్ ద్వారా అతి తక్కువ ధరకే క్యాబ్ బుక్ చేసుకునే అవకాశం కలగనుంది.
భారత్ టాక్సీ (Bharat Taxi)యాప్ ప్రధానంగా డ్రైవర్ల సంపాదనను పెంచడంపై దృష్టి పెట్టింది. సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు డ్రైవర్ల సంపాదనలో భారీగా కమీషన్లు తీసుకుంటాయి. కానీ భారత్ టాక్సీలో డ్రైవర్లు తాము సంపాదించిన మొత్తంలో 80 శాతానికి పైగా తమ వద్దే ఉంచుకోవచ్చు.
కేవలం 20 శాతం మాత్రమే నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తారు. దీనివల్ల డ్రైవర్లకు ఆదాయం పెరగడమే కాకుండా, ప్రయాణికులకు కూడా సరసమైన ధరలకే రైడ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో 56 వేల మందికి పైగా డ్రైవర్లు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవడం విశేషం.
ఈ యాప్ లో కేవలం కార్లు మాత్రమే కాకుండా ఆటోలు , బైక్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీ , గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు. త్వరలోనే దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.
ఈ యాప్(Bharat Taxi)లో మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే, ఇది మెట్రో రైలు సర్వీసులతో కలిసి పనిచేస్తుంది. అంటే మీరు ఒకే చోట మీ మొత్తం ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. భద్రత విషయంలో కూడా రాజీ పడకుండా ఢిల్లీ పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో దీని బీటా వెర్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
