Kohinoor diamond
వజ్ర వైఢూర్యాలు, సిరిసంపదలతో విరాజిల్లిన ప్రాచీన భారతీయ సంస్కృతికి , మొఘలాయి స్వర్ణయుగానికి ప్రతీకగా నిలిచిన అద్భుత కళాఖండం నెమలి సింహాసనం (Peacock Throne). వేలాది అమూల్యమైన వజ్రాలు, రత్నాలు, బంగారం కలగలిపి రూపొందించిన ఈ సింహాసనం ఆనాటి అద్భుతమైన శిల్పకళాసృష్టికి నిదర్శనం. ముఖ్యంగా, దీనిపై పొదిగిన వెలకట్టలేని కోహినూర్ వజ్రం(Kohinoor diamond) ఈ సింహాసనానికి కలికితురాయిగా ఉండేది.
విక్రమాదిత్యుని సింహాసనం స్ఫూర్తి.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ (1635లో) ప్రాచీన భారతీయ చక్రవర్తి విక్రమాదిత్య మహారాజుకు ఉన్న సింహాసనం లాంటిది తనకు కూడా ఉండాలని భావించాడు. ఈ ఆలోచనతోనే అటువంటి వైభవోపేతమైన సింహాసనాన్ని తయారుచేసే బాధ్యతను భారతీయ కళాకారులకు, శిల్పులకు అప్పజెప్పాడు. దీని కోసం వేలాది విలువైన వజ్రాలు, రత్నాలు, రంగు రాళ్లను ఉపయోగించారు. ఈ సింహాసనం యొక్క వైభవం ఎంతటిదంటే, చక్రవర్తి సమావేశ మందిర నిర్మాణాన్ని కూడా ఈ సింహాసనానికి అనుగుణంగా పెంచుకుంటూ వెళ్లారట.
రాజ్యాధికారానికి చిహ్నం.. ఈ సింహాసనం చుట్టూ ఉండే దేవతా విగ్రహాలు మొదటిసారిగా చూసిన వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేవి. భారతదేశాన్ని పరిపాలించే చక్రవర్తి ఈ సింహాసనంపై అతి కీలకమైన స్థానంలో కూర్చునేవాడు. వ్యాపార నిమిత్తమైనా, ఏదైనా కోరికలు కోరడానికైనా వచ్చే ఎవరికైనా, ఆ సింహాసనంపై కూర్చున్న చక్రవర్తి వారికి కోరికలు తీర్చే దేవుడిలా కనిపించేవాడు. ఈ సింహాసనం రాజ్యానికి ,రాజ్యాధికారానికి చిహ్నముగా ఉండేది.
మొఘలుల ఆధిపత్యం పతనం… ఔరంగజేబు తర్వాత సింహాసనం ఎక్కిన మొఘల్ చక్రవర్తులు అంత సమర్థులు కాకపోవడంతో, మొఘలుల ఆధిపత్యం క్రమంగా పతనమవడం ప్రారంభమైంది. అయినా కూడా, ఈ సింహాసనం చాలా కాలం పాటు భారతదేశానికి, మొఘలుల రాజరికానికి గుర్తుగా గుర్తించబడింది.
నాదిర్ షా దోపిడీ, సింహాసనం చేజారిపోవడం.. 1739లో, పర్షియా దేశం నుంచి నాదిర్ షా భారతదేశంపైకి దండయాత్ర చేసి వేలాది మందిని హతమార్చాడు. ఢిల్లీలోని నేటి చాందిని చౌక్ ప్రాంతంలో ఏకంగా 30,000 మంది భారతీయులను ఊచకోత కోశాడు. ఈ భీతావహ పరిస్థితులకు భయపడిన అప్పటి హిందుస్తాన్ చక్రవర్తి మొహమ్మద్ షా, నాదిర్ షాతో కాళ్ల బేరానికి వచ్చి ఊచకోత ఆపమని బ్రతిమాలవలసి వచ్చింది.
ఆ పరిస్థితులలో మొహమ్మద్ షా తన విలువైన ఆస్తులు, వజ్రాలు, రత్నాలు, బంగారం, వెండి ఆభరణాలను నాదిర్ షాకు వదులుకోవలసి వచ్చింది. నాదిర్ షా పోతూ పోతూ అత్యంత విలువైన నెమలి సింహాసనాన్ని కూడా తన దేశం పర్షియాకు పట్టుకుపోయాడు.
తిరిగి భారత్ చేరిన కోహినూర్ వజ్రం(Kohinoor diamond) ..నెమలి సింహాసనములోని విలువైన రత్నాలు , బంగారాన్ని తర్వాత కాలంలో తొలగించి, ఆ సింహాసనాన్ని చరిత్రలో కలిపేశారు. అయితే, సింహాసనంతో పాటు ఉన్న కోహినూర్ వజ్రం 1813లో ఒక అఫ్ఘన్ సేనాని ద్వారా మహారాజా రంజిత్ సింగ్‌కు బహుమతిగా ఇవ్వబడటం వల్ల తిరిగి భారతదేశానికి చేరింది. మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరం బ్రిటిష్ వారు పంజాబ్‌ను ఆక్రమించుకోవడం వల్ల, ఈ వజ్రం వారి స్వాధీనంలోకి వెళ్లింది. ఆ విధంగా కోహినూర్ వజ్రం(Kohinoor diamond) భారతదేశాన్ని వదలి ఇంగ్లాండ్ రాణి కిరీటంలోకి చేరింది.
