Mumbai
ముంబై(Mumbai).. ఎప్పుడూ వేగంగా కదులుతూ ఉండే మహానగరం. కానీ, రెండు రోజుల క్రితం, అంటే సెప్టెంబర్ 4న వచ్చిన ఒక బెదిరింపు మెసేజ్ ఆ నగరాన్ని అప్రమత్తం చేసి, ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఒక వాట్సాప్ లో’హ్యూమన్ బాంబ్స్’ ,ఆర్డీఎక్స్ పేలుళ్ల గురించి వార్నింగ్ మెసేజ్ రావడంతో, నగర భద్రతా యంత్రాంగం అత్యవసరంగా రంగంలోకి దిగింది.
ఈ బెదిరింపుల వల్ల ముంబై (Mumbai)ట్రాఫిక్ పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ సహా అన్ని భద్రతా బలగాలు సెప్టెంబర్ 4 నుంచీ హై అలర్ట్‌లో ఉన్నాయి. ముఖ్యంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి నగరంలో విస్తృతంగా తనిఖీలు, డ్రోన్ల నిఘా, బాంబు స్క్వాడ్‌ల మోహరింపు కొనసాగుతోంది.
అయితే ఈ బెదిరింపును పంపినది నోయిడాకు చెందిన అశ్విన్ కుమార్ సుప్రా అనే వ్యక్తి అని పోలీసులు వేగంగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. స్నేహితులపై పగతో ఈ నకిలీ మెసేజ్ పంపినట్లు విచారణలో తేలింది.అయితే, ఆ మెసేజ్ నకిలీదని తెలిసినా, ముంబై నగరంలో ఉద్రిక్తత మాత్రం పూర్తిగా తగ్గలేదు.
గతంలో జరిగిన తీవ్రమైన ఉగ్రదాడి ఘటనలను తలచుకుంటూ, ప్రజలు ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యే వరకు భద్రతా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. పోలీసులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సంఘటన నకిలీ బెదిరింపులు దేశ భద్రతకు ఎంత పెద్ద సవాలుగా మారాయో మరోసారి రుజువు చేసింది. పోలీసులు ప్రతి బెదిరింపును సీరియస్‌గా తీసుకుంటూ, నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. అందుకే, ప్రజల సహకారం కూడా అంతే అవసరం.