Smriti Mandhana: అనుకోని సంఘటన.. ఆగిపోయిన స్మృతి పెళ్లి

Smriti Mandhana: ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాసన్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అంబులెన్స్ ను పిలిపించి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.

Smriti Mandhana

భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)పెళ్లి అనూహ్యంగా వాయిదా పడింది. స్మృతి (Smriti Mandhana) తండ్రి అస్వస్థతకు గురవడమే దీనికి కారణం. ఇటీవలే మ్యూజిక్ కంపోజర్ కమ్ సింగర్ పలాశ్ ముచ్చల్ తో ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది. పెళ్లికి సంబంధించిన పనులు కూడా సందడిగా సాగుతున్నాయి. శనివారం సంగీత్ కార్యక్రమాన్ని కూడా ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భారత మహిళా క్రికెటర్లు జెమీమా, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి కూడా సందడి చేశారు. ఇవాళ సాయంత్రం వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి ఏర్పాట్లలో అందరూ బిజీగా ఉన్నారు. అయితే ఉదయం స్మృతి  తండ్రి శ్రీనివాసన్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అంబులెన్స్ ను పిలిపించి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.

పెళ్లి జరిగే సమయంలో అంబులెన్స్ రావడంతో బంధువలంతా ఆందోళన చెందారు. స్మృతి తండ్రిని హాస్పిటల్ కు తరలించడంతో పెళ్ళింట టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం స్మృతి తండ్రికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని స్మృతి మేనేజర్ ధృవీకరించారు.

బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత గుండెల్లో నొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళామని తెలిపారు. తండ్రి అంటే స్మృతికి చాలా ఇష్టమని, ఆయన కోలుకుని తిరిగి వచ్చాకే పెళ్లి చేసుకుంటానని చెప్పిందని వెల్లడించారు. దీంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

Smriti Mandhana

2019 నుంచి స్నేహితులుగా ఉన్న స్మృతి,పలాశ్ ముచ్చల్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది డబ్ల్యూపీఎల్ సందర్భంగా కొన్ని ఫోటోలతో వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత క్రమంగా సోషల్ మీడియాలో పోస్టులతో వీరిద్దరూ పరోక్షంగా ధృవీకరించారు. స్మృతి (Smriti Mandhana)ఆడే మ్యాచ్ లకు పలాశ్ రెగ్యులర్ గా హాజరవుతూ ప్రోత్సహించారు. ఇటీవల ప్రపంచకప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియంలోనే పలాశ్ వినూత్నంగా పిచ్ పై ఆమెకు ప్రపోజ్ చేసారు.

దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. బాలీవుడ్ లో మ్యూజిక్ కంపోజర్ , సింగర్ గా పలాశ్ గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కూడా నటించారు. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టులో స్మృతి కీలక ప్లేయర్ గా రాణిస్తోంది. ఇటీవల ప్రపంచకప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ గా నిలిచింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version