Puran Kumar: పూరణ్ కుమార్ కేసులో అనూహ్య మలుపు.. రివాల్వర్ తో కాల్చుకుని ఏఎస్ఐ సూసైడ్
Puran Kumar: సూసైడ్ చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందే ఒక లెటర్ తో పాటు ఓ వీడియోను కూాడా రికార్డు చేశాడు. నిజాన్ని బతికించడం కోసం తాను ప్రాణాలను త్యాగం చేస్తున్నట్టు లేఖలో రాసుకొచ్చాడు.

Puran Kumar
హర్యానాలో పోలీసు అధికారుల వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ సింగ్ తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రస్తుతం ఆయన సూసైడ్ వెనుక కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే దర్యాప్తులో కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వేళ ఏఎస్ఐ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూరణ్ కుమార్(Puran Kumar) కేసును దర్యాప్తు చేస్తున్న టీమ్ లో ఉన్న ఏఎస్ఐ సందీప్ కుమార్ రివాల్వర్ తో షూట్ చేసుకున్నాడు.
సూసైడ్ చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందే ఒక లెటర్ తో పాటు ఓ వీడియోను కూాడా రికార్డు చేశాడు. నిజాన్ని బతికించడం కోసం తాను ప్రాణాలను త్యాగం చేస్తున్నట్టు లేఖలో రాసుకొచ్చాడు. దీంతో ఏఎస్ఐ సూసైడ్ కు కారణాలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను సూసైడ్ నోట్ లో కీలక విషయాలు పొందుపరిచాడని తెలుస్తోంది. ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డ పూరణ్ కుమార్(Puran Kumar)పై సందీప్ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఆయన పెద్ద అవినీతిపరుడని, అవినీతి అంతా బయటకొస్తుందనే సూసైడ్ చేసుకున్నట్టు వెల్లడించాడు.

రోహ్‍తక్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత పూరణ్ కుమార్ నిజాయితీపరులైన పోలీసులను తప్పించి వారి స్థానంలో తనకు సహకరించే అవినీతిపరులను నియమించుకున్నట్టు లేఖలో సందీప్ ఆరోపించాడు. ఈ క్రమంలో మరికొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశాడు. బాధితులకు ఫోన్ చేసి, బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడని , అంతే కాకుండా మహిళా పోలీసులను సైతం లైంగికంగా వేధించాడంటూ లేఖలో రాశాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఫిర్యాదులకు భయపడే ఆత్మహత్య చేసుకున్నారంటూ పేర్కొన్నాడు.
కాగాపూరణ్ కుమార్ అక్టోబర్ 7న తన నివాసంలో రివాల్వర్ తో షూట్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సూసైడ్ స్పాట్ లో పోలీసులు 9 పేజీలు లేఖ స్వాధీనం చేసుకున్నారు. తాను ఉద్యోగం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నానంటూ పూరన్ కుమార్ రాసుకొచ్చారు. హర్యానా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కుల వివక్ష ఉందంటూ లేఖలో పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే పూరణ్ కుమార్(Puran Kumar) మృతదేహానికి ఇప్పటి వరకూ అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ పోస్టుమార్టానికి అనుమతి ఇవ్వడం లేదు. ఈ ఘటన హర్యానాలో రాజకీయంగానూ తీవ్ర ప్రకంరనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.