Vande Bharat sleeper
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చైర్ కార్ (Chair Car) , నార్మల్ సిట్టింగ్ సదుపాయాలను మాత్రమే అందిస్తున్నాయి. దీంతో సుదూర ప్రయాణాలు చేసే వారికి రాత్రిపూట ప్రయాణానికి స్లీపర్ క్లాస్ లేని లోటు స్పష్టంగా ఉంది. ఈ లోటును పూడ్చేందుకు, రైల్వే శాఖ త్వరలోనే వందే భారత్ స్లీపర్ (Vande Bharat sleeper)రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన తాజా ప్రకటన ప్రకారం, ఈ డిసెంబర్ (December) నెలలోనే వందే భారత్ స్లీపర్ రైళ్ల(Vande Bharat sleeper)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
మొదటి ప్రొటోటైప్ స్లీపర్ రైళ్లలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ప్రయాణీకులకు అత్యున్నత ప్రమాణాలు, మెరుగైన సౌకర్యం అందించేందుకు, ఎటువంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా ఆ లోపాలను సరిదిద్దారు. ఈ సవరణల అనంతరం మెరుగైన నాణ్యతతో ఈ స్లీపర్ రైళ్లు ట్రాక్ ఎక్కనున్నాయి.
ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్ల వేగం , సౌకర్యాలకు అదనంగా, ఈ కొత్త స్లీపర్ రైళ్లు ప్రయాణీకులకు లగ్జరీ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ఈ కొత్త రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 ఏసీ 3 టైర్, 4 ఏసీ 2 టైర్ , ఒకటి ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ రైళ్లలో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణం అందించడానికి అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.ఇంటిగ్రేటెడ్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, విజువల్ డిస్‌ప్లే, అత్యాధునిక కెమెరాలు, ఆటోమేటిక్ డోరింగ్ సిస్టమ్, ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు , ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నాయి.
రీడింగ్ లైట్స్, పవర్ ఛార్జింగ్ పాయింట్లు , ప్రశాంతమైన ప్రయాణం కోసం నైట్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అలాగే మాడ్యులర్ కిచెన్ సదుపాయం, బయో వాక్యూమ్ టాయిలెట్లు (Bio-Vacuum Toilets), బేబీ కేర్ సదుపాయం ,హాట్ వాటర్ షవర్లు (Hot Water Shower) వంటి సౌకర్యాలు ఉండనున్నాయి.
ఈ రైళ్లలో రిజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం (Regenerative Braking System) ఉంటుంది, ఇది రైలు వేగాన్ని తగ్గిస్తున్నప్పుడు శక్తిని తిరిగి ఉత్పత్తి చేసి విద్యుత్‌ను ఆదా చేస్తుంది.
ఈ వందే భారత్ స్లీపర్ రైళ్ల రాకతో, సుదూర ప్రాంతాలకు వేగంగా , సౌకర్యవంతంగా ప్రయాణించాలనుకునే ప్రయాణీకుల చిరకాల స్వప్నం నెరవేరనుంది.
