dark patterns: ఏంటీ డార్క్ ప్యాటర్న్స్? కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంది..?

dark patterns:వినియోగదారులను తప్పుదారి పట్టిస్తూ, వారికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేస్తాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ‘డార్క్ ప్యాటర్న్స్’పై కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Dark patterns

మీరు తరచుగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారా? అయితే ఈ-కామర్స్ సైట్లు, యాప్‌లు మిమ్మల్ని ఆకర్షించడానికి కొన్ని మోసపూరిత పద్ధతులను ఉపయోగిస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. వీటినే ‘డార్క్ ప్యాటర్న్స్’ (Dark patterns) అని పిలుస్తారు. ఇవి వినియోగదారులను తప్పుదారి పట్టిస్తూ, వారికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేస్తాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ‘డార్క్ ప్యాటర్న్స్’పై కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

సాధారణంగా కనిపించే ‘డార్క్ ప్యాటర్న్స్’ (Dark patterns) అంటే..ఈ మోసపూరిత పద్ధతులను గుర్తించడం కష్టం. కానీ, చాలా సైట్లలో ఇవి మనకు తారసపడతాయి.

నకిలీ అర్జెన్సీ (False Urgency): స్టాక్ తక్కువగా ఉంది,ఇంకా రెండు పీసులే మిగిలాయి, లేదా ఈ ఆఫర్ ఇంకా రెండు గంటల్లో ముగుస్తుంది వంటి సందేశాలు మీకు తెలిసే ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇది కేవలం మిమ్మల్ని తొందరపెట్టడానికి ఉపయోగించే ఒక వ్యూహం మాత్రమే.

బాస్కెట్ స్నీకింగ్ (Basket Sneaking): మీరు ఆర్డర్ చేసేటప్పుడు, మీ అనుమతి లేకుండానే షాపింగ్ కార్ట్‌లో అదనపు వస్తువులను చేర్చడం. దీనివల్ల బిల్లు మొత్తం పెరుగుతుంది.

సబ్‌స్క్రిప్షన్ ట్రాప్ (Subscription Trap): ఒక సేవకు సబ్‌స్క్రైబ్ చేయడం సులభం, కానీ దాన్ని రద్దు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కస్టమర్లు విసిగిపోయి సబ్‌స్క్రిప్షన్ కొనసాగించేలా చేయడం దీని లక్ష్యం.

డ్రిప్ ప్రైసింగ్ (Drip Pricing): మొదట ఒక తక్కువ ధర చూపించి, చివరికి చెల్లింపు చేసేటప్పుడు రకరకాల అదనపు ఛార్జీలు కలపడం.

Dark patterns

అయితే వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం ఈ మోసపూరిత పద్ధతులను అన్యాయమైన వ్యాపార పద్ధతులు (Unfair Trade Practices)గా గుర్తించింది. ఈ సమస్యను నివారించడానికి, కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) నవంబర్ 30, 2023న ‘డార్క్ ప్యాటర్న్స్’ నివారణ, నియంత్రణ కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది.

సెల్ఫ్ ఆడిట్..అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు మూడు నెలల్లోగా తమ సైట్‌లను సెల్ఫ్ ఆడిట్ చేసి, తమ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి పద్ధతులు లేవని ధ్రువీకరించుకోవాలని కేంద్రం ఆదేశించింది.

జాయింట్ వర్కింగ్ గ్రూప్: ‘డార్క్ ప్యాటర్న్స్’(Dark patterns)ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడానికి వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.అయితే ఆన్లైన్ షాపింగ్‌పై మనం కాస్త అవగాహన పెంచుకుంటే ఇలాంటి మోసాల బారిన పడే అవకాశం ఉండదన్న సంగతి గమనించాలి.

Exit mobile version