Jaipur
భారతదేశంలో అత్యంత అందమైన, చారిత్రక నగరాల్లో రాజస్థాన్‌లోని జైపూర్(Jaipur) ఒకటి. దీనిని ముద్దుగా ‘పింక్ సిటీ’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే ఈ నగరం, భారతీయ సంస్కృతి, చరిత్రతో పాటు అద్భుతమైన నిర్మాణ శైలికి ఒక గొప్ప ఉదాహరణ. జైపూర్‌ను సందర్శిస్తే తప్పక చూడాల్సిన ఐదు అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.
1. సిటీ ప్యాలెస్.. మొఘల్, రాజ్‌పుత్ శైలుల అద్భుతమనే చెప్పాలి. జైపూర్‌లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో సిటీ ప్యాలెస్ మొదటి స్థానంలో ఉంటుంది. జైపూర్ వ్యవస్థాపకుడైన మహారాజా సవాయి జై సింగ్ ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఇందులో మొఘల్ మరియు రాజ్‌పుత్ నిర్మాణ శైలులు కలిసి ఒక అందమైన కళాఖండంగా నిలుస్తాయి. ప్యాలెస్ కాంప్లెక్స్‌లో ఉన్న ముబారక్ మహల్, క్వీన్స్ ప్యాలెస్ ప్రత్యేక ఆకర్షణ. ముబారక్ మహల్‌లోని మహారాజా సవాయి మాన్ సింగ్ II మ్యూజియంలో రాజ కుటుంబాల దుస్తులు, పష్మినా శాలువాలు, బనారస్ పట్టు చీరలు వంటి ఎన్నో అరుదైన వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి.
2. గల్తాజీ ఆలయం.. ఆధ్యాత్మికత, ప్రకృతి కలయికతో ఆకట్టుకుంటుంది. జైపూర్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో అరావళి కొండల మధ్య ఉన్న ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. చుట్టూ పచ్చదనం, దేవాలయాలు, పవిత్రమైన కోనేరులు, మంటపాలతో ఈ ప్రదేశం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆలయ సముదాయంలో సహజమైన నీటి బుగ్గతో నిండిన 7 పవిత్రమైన కోనేరులు ఉన్నాయి. పింక్ ఇసుకరాయితో నిర్మించిన ఈ గ్రాండ్ టెంపుల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
3. అమెర్ కోట..చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. జైపూర్(Jaipur)కు 11 కి.మీ. దూరంలో ఉన్న ఈ కోటను అంబర్ కోట లేదా అంబర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది జైపూర్‌లోని అతిపెద్ద కోటల్లో ఒకటి. పసుపు మరియు గులాబీ రంగులతో నిర్మించబడిన ఈ కోట రాజ్‌పుత్ మరియు మొఘల్ వాస్తుశిల్పానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇందులో దివాన్-ఎ-ఆమ్, దివాన్-ఎ-ఖాస్, షీష్ మహల్ (జై మందిర్), సుఖ్ నివాస్ వంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒకప్పుడు రాజ్‌పుత్ మహారాజులు వారి కుటుంబాలతో కలిసి ఇక్కడే నివసించేవారు.
4. పన్నా మీనా కుండ్.. ప్రాచీన మెట్ల బావిగా ప్రసిద్ధి. పన్నా మీనా కుండ్ అనేది ఒక పురాతన మెట్ల బావి. పూర్వకాలంలో నీటి కోసం ఇది ప్రధాన వనరుగా ఉండేది. ఇప్పుడు ఇది పర్యాటకులను ఆకర్షించే ఒక చారిత్రక కేంద్రంగా మారింది. ఇక్కడికి వచ్చేవారు ఈ పురాతన నిర్మాణ శిల్పకళను చూసి ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
5. కనక బృందావనం.. అద్భుతమైన ఉద్యానవనంగా చెబుతారు.జైపూర్ (Jaipur)నుంచి 8 కి.మీ దూరంలో, అరావళి కొండల చుట్టూ ఉన్న లోయలో నహర్‌ఘర్ కోట కింద ఈ తోట ఉంది. 280 సంవత్సరాల క్రితం జైపూర్ వ్యవస్థాపకుడైన మహారాజా సవాయి జై సింగ్ దీనిని నిర్మించారు. ఈ ఉద్యానవనానికి రాణి కనకదే పేరు పెట్టారు. ఈ ప్రదేశం నుంచి అమెర్ ఫోర్ట్, నహర్‌ఘర్ కోట, జైగర్ కోటలను చూడవచ్చు. ఇక్కడి గోవిందుడి విగ్రహం బృందావనం నుంచి వచ్చినందున దీనికి ‘బృందావనం’ అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశం చరిత్ర, ప్రకృతి అందాల కలయికతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.