GST
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST) పన్నుల విధానంలో తీసుకొచ్చిన భారీ మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయి. అయితే, మరోవైపు విలాసవంతమైన వస్తువులు, ‘పాపపు వస్తువులు’ (Sin goods) మరింత ప్రియం కానున్నాయి.
పన్ను వ్యవస్థలో విప్లవాత్మక మార్పు..దేశంలో ఇప్పటివరకు ఉన్న నాలుగు జీఎస్టీ(GST) స్లాబ్‌లకు బదులుగా, ఇప్పుడు కేవలం రెండు కొత్త స్లాబ్‌లు మాత్రమే అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం వినియోగాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు కొత్త స్లాబ్‌లు ఇలా ఉన్నాయి.
5 శాతం స్లాబ్ ..ప్రజలు రోజూ ఉపయోగించే ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, కొన్ని ముఖ్యమైన వస్తువులు ఈ స్లాబ్‌లో ఉంటాయి. ఈ మార్పు వల్ల సామాన్యుడి జీవన భారం తగ్గుతుంది.
18 శాతం స్లాబ్.. సామాన్య వినియోగ వస్తువులు , కొన్ని ఎలక్ట్రానిక్స్ ఈ స్లాబ్‌లో ఉంటాయి.
కొత్త 40 శాతం పన్ను – ఎందుకు అంటే..కొత్తగా ప్రవేశపెట్టిన 40 శాతం పన్నును విలాసవంతమైన వస్తువులు మరియు ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులపై విధించారు. పాన్ మసాలా, సిగరెట్లు, లగ్జరీ కార్లు, పెద్ద ఇంజన్ బైక్‌లు, క్యాసినో, గుర్రపు పందాలు వంటివాటికి ఈ పన్ను వర్తిస్తుంది. దీనివల్ల అధిక ఆదాయం ఉన్నవారు మాత్రమే ఈ వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు, దీని ద్వారా సామాజిక సమతుల్యత కూడా సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఏయే వస్తువుల ధరలు తగ్గాయి?
ఆహార పదార్థాలలో పాలు, వెన్న, నెయ్యి, పనీర్, బిస్కెట్లు, చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్, పాస్తా, పరోటా, చపాతీ వంటివి ఇదివరకు 12-18 శాతం పన్ను నుంచి ఇప్పుడు కేవలం 5 శాతానికి తగ్గాయి.నిత్యావసరాలలో షాంపూ, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్ వంటి వస్తువులు 18 శాతం నుంచి 5 శాతానికి మారనున్నాయి.
ఎలక్ట్రానిక్స్‌లో వాషింగ్ మెషీన్లు, టీవీలు వంటివి 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతాయి.అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, మందులు, విద్యా సంబంధిత వస్తువులు, చిన్న కార్లు, పాదరక్షలు, బట్టలు, టూ-వీలర్ల ధరలు కూడా తగ్గుతాయి.
పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ మోడళ్లపై ధరలను తగ్గించాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, హోండా, టయోటా, నిస్సాన్, రెనాల్ట్ వంటి పెద్ద కంపెనీలు ధరలు తగ్గించాయి. ఉదాహరణకు, టయోటా లెజెండర్ మోడల్ ధర రూ. 3.34 లక్షలు తగ్గగా, మహీంద్రా తన పెట్రోల్ మోడల్‌పై రూ. 2.56 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. టాటా, హ్యుందాయ్, మారుతి వంటి కంపెనీలు మోడల్, ఇంజన్ రకాన్ని బట్టి రూ. 2.40 లక్షల వరకు తగ్గింపును ప్రకటించాయి.
ఇటు ఈ సంస్కరణల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ. 2 లక్షల కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. ఈ కొత్త జీఎస్టీ(GST) వ్యవస్థ సామాన్య ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడమే కాకుండా, దేశ ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలో సహాయపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.