Bihar election 2025
దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న బిహార్ (Bihar election 2025)తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగానే సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈసీ సమాచారం ప్రకారం 64 శాతానికి పైగా తొలి దశలో ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. బెగుసరాయ్ నియోజకవర్గంలో అత్యధికంగా 59.82శాతం పోలింగ్ నమోదైంది.
పాట్నాలో సాయంత్రం 5 గంటల వరకూ 60.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. పోలింగ్ సమయం ముగిసేటప్పటికీ క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పూర్తిస్థాయి ఓటింగ్ శాతం తర్వాత ప్రకటించనున్నారు. ఓవరాల్ గా మాత్రం 65 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. గత మూడు పర్యాయాల్లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు.
పోలింగ్ సందర్భంగా ఇవాళ ఉదయమో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాగా తొలి దశలో 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దాదాపు. 3.75 కోట్లకు పైగా ఓటర్లు ఓటు వేసినట్టు సమాచారం. పాట్నా, దర్భంగా, బెగుసరాయ్, లఖిసరాయ్, ముంగేర్, షేక్‌పురా, నలంద, బక్సర్ , భోజ్‌పూర్ మాధేపురా, సహర్సా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తిపూర్ తొలి దశ పోలింగ్ లో ఉన్నాయి.
బిహార్(Bihar election 2025) లోని చాలా మంది ప్రముఖులు తొలి దశలోనే ఓటు వేసేసారు. పట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ , ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్, ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఓటు వేశారు. మరికొందరు కేంద్రమంత్రులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్ లోని పరిస్థితుల దృష్ట్యా భారీ భద్రతను కల్పించారు.
