DK Shivakumar
కర్ణాటక సీఎం మార్పు అంశం అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తోంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించడం ఖాయమనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దీని ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 1లోపు పరిష్కరించేందుకు చర్చలు జరుపుతోంది. సిద్ధరామయ్య వర్గం ప్లాన్ బితో రెడీ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డీకే శివకుమార్(DK Shivakumar) కు సీఎం పదవి దక్కకూడదనే ప్రయత్నాల్లో ఉంది.
ఒకవేళ సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పిస్తే ఆ స్థానంలో శివకుమార్ కాకుండా మరెవరికిచ్చినా అభ్యంతరం లేదనేలా మద్ధతు కూడగడుతున్నట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్‌ను ఒకవేళ సీఎంగా ప్రకటిస్తే ఆ మరుక్షణమే సిద్ధరామయ్య మద్దతుదారులు కార్యాచరణలోకి దిగుతారని సమాచారం. సీఎం పదవికి ప్రత్యామ్నాయ నాయకుల పేర్లను అధిష్ఠానం ముందు ఉంచాలని నిర్ణయించారు. సిద్ధూ మద్దతుదారుడు, దళిత నేత హోంమంత్రి జి పరమేశ్వర తాను కూడా రేసులో ఉన్నట్టు ప్రకటించుకున్నారు. అయితే, ఇది సిద్ధూ వర్గం ఎత్తుగడగా తెలుస్తోంది.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుంచి సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్(DK Shivakumar) మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరును జరుగుతూనే ఉంది. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్‌కు సీఎం పదవి అప్పగించాల్సి ఉందని, ఆయన వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు.
డీకే శివకుమార్ కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తమవైపు నుంచి బలమైన సంకేతాలు కూడా ఇచ్చేశారు. డీకే కూడా గత కొంతకాలంగా పెద్దగా వివాదాల జోలికి వెళ్లడం లేదు.. కొన్ని సార్లు సిద్ధరామయ్యకు మద్దతుగా కూడా మాట్లాడారు. అయితే, అప్పుడప్పుడు విమర్శలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఒకవైపు తమ తమ ప్రయత్నాల్లో ఉన్న సిద్దరామయ్య, డీకే శివకుమార్
సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు, సెటైర్లు విసురుకుంటున్నారు. డీకే శివకుమార్(DK Shivakumar) చేసిన ట్వీట్ తో ఈ సోషల్ మీడియా వార్ మొదలైంది. మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలమని ట్వీట్ చేశారు. డీకే శివకుమార్ ట్వీట్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు అంటూ రిప్లై ఇచ్చారు. ఇక అధిష్టానం మాత్రం వీరిద్దరితో శుక్రవారం చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. అనంతరం డిసెంబర్ 1 లోపు పరిష్కారంపై అధికారిక ప్రకటన చేసే ఛాన్సుంది.
