January 1st
మరికొద్ది రోజుల్లో 2025 కాలగర్భంలో కలిసిపోయి 2026 కొత్త సంవత్సరం రాబోతోంది. ప్రపంచమంతా జనవరి 1 (January 1st)కోసం వెయిట్ చేస్తోంది. మన దేశంలో కూడా పెద్ద పెద్ద సిటీల నుంచి పల్లెల వరకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ కేకలు, కేక్ కటింగ్స్, అర్ధరాత్రి పార్టీలు, మద్యం విందులతో సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు.
అయితే, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు జనవరి 1వ తేదీ (January 1st)భారతీయులకు ఏ విధంగా కొత్త సంవత్సరం అవుతుంది? బ్రిటిష్ వారు మన దేశం వదిలి వెళ్లినా సరే.. వారు అంటగట్టిన ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ కల్చర్‌ను మనం ఎందుకు ఇంతలా నెత్తిన పెట్టుకుంటున్నాం? మన పండుగ ఉగాది వచ్చినప్పుడు కనిపించని హడావుడి, కేవలం క్యాలెండర్ లో తేదీ మారినప్పుడు ఎందుకు ఇంతగా కనిపిస్తుంది? దీని వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక ,మానసిక కారణాలను ప్రతి ఒక్కరూ లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
భారతదేశంలో జనవరి 1 (January 1st)వేడుకలు.. బ్రిటిష్ కాలం నాటి కలోనియల్ మెంటాలిటీకి నిదర్శనం. పరిపాలనా సౌలభ్యం కోసం వారు ప్రవేశపెట్టిన క్యాలెండర్, నేడు మన కల్చర్‌ను మింగేస్తోంది. రోమన్ దేవుడు జానస్ పేరు మీద ఏర్పడిన జనవరి మాసం, మన దేశ రుతువులతో కానీ, నక్షత్ర గమనంతో కానీ ఎటువంటి సంబంధమూ లేనిది.
కానీ మన ఉగాది, పుథందు, బైసాఖి వంటి పండుగలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి. వసంత రుతువు రాక, చెట్లు చిగురించడం, కోయిల కూతలు.. ఇవన్నీ ఒక కొత్త జీవం పుట్టుకకు సంకేతాలు. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ , సోషల్ మీడియా ప్రభావంతో యువత అర్బన్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోయింది.
పాశ్చాత్య దేశాల్లో ఉండే పార్టీ కల్చర్, పబ్‌లు, మద్యం పార్టీలు యూత్‌కు ఒక గ్లామర్ లా కనిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, కొన్ని సినిమాలు ఈ పాశ్చాత్య మోజును మరింత పెంచుతున్నాయి. వెస్ట్రన్ అంటే ప్రొగ్రెసివ్, దేశీ అంటే ఓల్డ్ ఫ్యాషన్ అనే ఒక తప్పుడు భావజాలాన్ని యువత మెదళ్లలోకి చొప్పిస్తోంది.
దీని వల్ల ఆర్థికంగా లాభపడేది ఎవరా అని చూస్తే, సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దపెద్ద హోటళ్లు, పబ్‌లు, లిక్కర్ కంపెనీలు , విదేశీ కార్పొరేట్ బ్రాండ్లు ఈ మూడు రోజుల్లోనే వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని కొల్లగొడతాయి. 2025 వింటర్ సీజన్లో పార్టీలు, వేడుకల ద్వారా సుమారు రూ. 4.74 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుందని అంచనా. ఈ ఆదాయంలో చాలా ఎక్కువ భాగం విదేశీ కంపెనీలకే వెళ్తుందన్న విషయం చాలామందికి తెలియదు.
అదే మన ఉగాది, సంక్రాంతి వంటి పండుగలకు జరిగే వ్యాపారం.. స్థానిక వ్యాపారులకు, కుమ్మరులకు, చేనేత కార్మికులకు , రైతులకు ఉపయోగపడుతుంది. జనవరి 1న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వల్ల కుటుంబ బాంధవ్యాలు బలపడటం కంటే, వ్యక్తిగత విలాసాలకే ప్రాధాన్యత దక్కుతోంది. యువత ఐడెంటిటీ క్రైసిస్‌లో పడి, తమ సొంత పంచాంగం, తిథులు, నక్షత్రాల గురించి కనీస అవగాహన లేకుండా పెరగడం ఒక పెద్ద సాంస్కృతిక నష్టంగా మారుతోంది.
దీనివల్ల మన దేశ సాంస్కృతిక వారసత్వం , సామాజిక విలువలు నిస్సందేహంగా నష్టపోతున్నాయి. మన తెలుగు పండుగలు కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేరిస్తే, న్యూ ఇయర్ వేడుకలు కేవలం స్నేహితులు, పార్టీలకే పరిమితం చేస్తున్నాయి. ఇది ఆర్థిక ఇబ్బందులకు కూడా దారి తీస్తుంది. ఎందుకంటే పార్టీల కోసం అప్పులు చేసే మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
మనం ఆధునికతను ఆహ్వానించాలి అయితే అది మన మూలాలను మర్చిపోయే విధంగా ఎప్పుడూ ఉండకూడదన్న విషయం అందరూ అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వం , విద్యాసంస్థలు మన స్వదేశీ పండుగల వెనుక ఉన్న సైన్స్ , సంస్కృతిని ప్రమోట్ చేయాలి. అప్పుడే 2026 వంటి కొత్త సంవత్సరాలు కేవలం తేదీల మార్పే అని చిన్నా, పెద్దా అంతా అర్ధం చేసుకుంటారు
