Kavitha: ఐదు వేళ్లు కలిపి గుప్పిట ముడిచి, పిడికిలిగా మారినప్పుడు, దాని బలం ఏంటో అందరికీ తెలిసిదే. ఇదే ఐకమత్యానికి కూడా వర్తిస్తుంది. పార్టీ అయినా, కుటుంబం అయినా పిడికిలిగా ఉన్నప్పుడే దాని విలువ. పిడికిలి నుంచి ఒక వేలు వేరయిందంటే ఆ కుటుంబంలో కానీ, పార్టీలో కానీ ఐకమత్యం అన్న పదమే వినిపించదు.
Kavitha:
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో(BRS Party) అదే కనపిస్తోంది. ఒకప్పుడు ఉద్యమాలకు ఊపిరిలూదిన పార్టీ..ఇప్పుడు ఊపిరి నిలబెట్టుకోవడానికి కూడా అవస్థలు పడుతుందా అన్న అనుమానాలు తలెత్తేలా చేస్తుంది. కేటీఆర్(KTR) ప్రెస్ మీట్ పెట్టారు..దానికి కవిత మద్దతు లేదు. కవిత(Kavitha) ధర్నా పేరుతో రోడ్డెక్కితే కేటీఆర్ సపోర్టే లేదు.
అలాగే అన్నను అందరిలో అనరాని మాటలు అన్నా.. చెల్లెలు తీరే పట్టనట్లు అన్న ఉన్నా..కుటుంబ పెద్ద అయిన కేసీఆర్ నోరే మెదపరు. అంతెందుకు ఒకప్పుడు ఐక్యతకు మారుపేరులా ఉండే గులాబీ బాస్ కుటుంబం..ఇప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్లుగానే ప్రవర్తిస్తోంది. చివరకు తీన్మార్ మల్లన్న విషయంలోనూ ఇదే జరగడంతో తెలంగాణలో డిబేట్లలో కూడా ఈ ఫ్యామిలీ మెయిన్ టాపిక్ అయింది.
దీంతో బాగా హర్ట్ అయిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్( KCR) గారాల పట్టి కవిత ..ఈ మధ్య కుటుంబం మీద, పార్టీ మీద తన అసంతృప్త రాగాలను బాహాటంగానే బయటపెడుతున్నారు. సొంతపార్టీలో నుంచే తిరుగబాటు జెండా ఎగరేస్తూ .. పార్టీకి, కేసీఆర్, కేటీఆర్ కు కొత్త టెన్షన్‌ను పుట్టిస్తూనే ఉన్నారు.
అదేదో సినిమాలో రావు రమేష్ అన్నట్లు శత్రువులు ఎక్కడో పుట్టరు కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో మన పక్కనే ఉంటారు అన్న డైలాగ్‌కు అక్షర రూపంగా కవిత మారిపోయిందా అన్నట్లుగా తయారయ్యారు. తాజాగా మరోసారి పార్టీపైన ఆమె చేసిన కామెంట్లు ఇంకాస్త గరంగరంగా మారి తెలంగాణ రాజకీయాలను మరింత హీటు పుట్టించాయి.
బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సమర్థించిన కవిత అక్కడితో ఆపలేదు. దీనిని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడం తప్పని బాంబు పేల్చారు. ఈ ఆర్డినెన్స్ సరైనదే అని చెబుతూ.. 2018లో చట్ట సవరణ ద్వారా దీనిని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్‌కు తాను బహిరంగ మద్దతు ప్రకటించానని చెప్పుకొచ్చారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తాను ఈ నిర్ణయానికి వచ్చానని బల్లగుద్దినట్లు క్లారిటీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ..బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకుని తన దారికి రావాలని కవిత మరో డైలాగ్ పేల్చారు. దీనికి వారు నాలుగు రోజుల సమయం తీసుకోవచ్చంటూ సెటైరికల్ కామెంట్ చేశారు.దీంతో బీఆర్ఎస్ లోనే ఉంటూ.. అదే పార్టీకి వ్యతిరేకంగా ఇలా వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ఆమె పార్టీ వర్గాలకు ఎలాంటి సందేశాన్నిస్తున్నారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఇంటర్నల్‌గా మాట్లాడుకోవాల్సిన అంశాలపై బహిరంగ ప్రకటనలు చేస్తూ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినా.. బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండటంతో కవిత జీర్ణించుకోలేకపోయారని..అందుకే ఇలా ఓపెన్‌గా ఫైర్ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. తీన్మార్ మల్లన్న విషయాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని పెద్ద పదం ఉపయోగించడం దీనిలో భాగమేనంటున్నారు.
అయితే ఇందులో కవిత తప్పే లేదని..తన ఇంటి ఆడపడుచుపై అనుచితంగా మాట్లాడితే పార్టీ పరంగా కాకపోయినా కుటుంబసభ్యులు అయినా ఖండించాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమయినా ఇకనైనా బీఆర్ఎస్ అధినేత జోక్యం అవసరం అని లేదంటే పార్టీ పరంగా, కుటుంబపరంగా సమస్యలు తప్పవని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.