By-poll: పార్టీకో సర్వే.. గెలుపెవరిదో మరి.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్
By-poll: జూబ్లీహిల్స్ పై ఇప్పటివరకు బిఆర్ఎస్ కి అనుకూలంగా 11 సర్వేలు వెలువడ్డాయి. అటు కాంగ్రెస్ కు కూడా అనుకూలంగా 4 సర్వేలు వచ్చాయి.
By-poll
సాధారణంగా ఉపఎన్నికల(By-poll)పై పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్(By-poll) మాత్రం రసవత్తరంగా మారిపోయింది. తమ పాలనకు రెఫరెండెంగా భావిస్తున్న కాంగ్రెస్, సింపతీతో సీటు నిలుపుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్.. ఉనికిని చాటుకునేందుకు బీజేపీ తాపత్రయపడుతున్నాయి. ప్రధాన పోటీ మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కూ మధ్యనే అన్నది అందరికీ తెలుసు. ప్రస్తుతం ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. పనిలో పనిగా కొన్ని సర్వేలు కూడా తెరపైకి వచ్చాయి. ఒక సర్వే బి ఆర్ఎస్ గెలుస్తుందని చెప్తుంటే…. మరో సర్వే జూబ్లీహిల్స్ లో కాంగ్రెసదే గెలుపంటోంది.
జూబ్లీహిల్స్ పై ఇప్పటివరకు బిఆర్ఎస్ కి అనుకూలంగా 11 సర్వేలు వెలువడ్డాయి. అటు కాంగ్రెస్ కు కూడా అనుకూలంగా 4 సర్వేలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో పాపులర్ అయిన కేకే సర్వే టిఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవబోతుందని చెప్పింది. డివిజన్ల వారీగా సర్వే చేసి మరి నెంబర్ల వారీగా ఫలితాలను విడుదల చేసింది.

55.2 ఓటింగ్ శాతంతో బిఆర్ఎస్ గెలుస్తుంది అని కూడా తేల్చేసింది. మరోవైపు లోక్ పోల్ అనే సంస్థ 3100 మందిని ప్రశ్నించి జూబ్లీహిల్స్ లో 44 శాతం జనం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారని, 38 శాతం మాత్రమే బిఆర్ఎస్ కు ఉన్నారని, బిజెపి 15% ఓట్లను కైవసం చేసుకుంటుందని తెలిపింది. అలాగే జనం సాక్షి అనే సంస్థ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పై సర్వే చేసింది. కాంగ్రెస్ 48.5 ఓటింగ్ శాతంతో గెలవబోతోందని జనం సాక్షి సంస్థ సర్వే చెప్తోంది.

ఇలా రకరకాల సర్వేలు,రకరకాల అభిప్రాయాల్ని… ఫలితాల్ని జనం ముందు ఉంచడంతో.. అవన్నీ పెయిడ్ సర్వేలన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. .సర్వేల పేరుతో ఒక పార్టీ గెలిచిపోయినట్లు ఒక పాజిటివ్ వైబ్ సృష్టిస్తే… మిగిలిన జనం కూడా గెలిచే పార్టీకే ఓటేద్దాం అనే అభిప్రాయంలోకి వస్తారని అంచనాతో ఉన్నట్టు చెబుతున్నారు. కానీ ఓటర్లు అంత తెలివి తక్కువవాళ్ళు కాదన్నది విశ్లేషకుల మాట. సర్వేలు, అంచనాలు ఎలా ఉన్నా ఓటు ఎవరికి వేయాలో చాలా మంది క్లారిటీ ఉంటుంది.
అభిమానం కొంత శాతం, పోలింగ్ ముందు రోజు ఇచ్చే తాయిలాలు, అధికారంలో ఉండే అనుచరుల ఒత్తిడి మరికొంత, సానుభూతి ఇంకాస్త.. ఇలా పలు విషయాలు ప్రభావం చూపిస్తాయి. అందుకే జనం కూడా సర్వేలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచడానికి ఇలాంటి సర్వేలు చేయించుకోక తప్పడం లేదంటూ పలువురు నేతలు బాహాటంగానే చెబుతున్నారు.



