Puri Jagannath Temple: దేశంలో పురాణాల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం ఒకటి. హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం కలిగిన ఈ దేవాలయ క్షేత్రంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. విష్ణు దేవుడు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. సైన్స్‌కు కూడా అంతుచిక్కకుండా ఉన్న ఈ ఆలయం అనేక రహస్యాలతో ముడిపడి ఉంది. ఇంతకీ ఈ ఆలయంలో మిస్టరీగా ఉన్న రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:
Puri Jagannath Temple:
1. ఆలయ నిర్మాణం: పూరీ జగన్నాథ్ ఆలయ నిర్మాణాన్ని ఒక మిస్టరీగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజినీరింగ్ నైపుణ్యమా లేదా దైవశక్తి బలమా అనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయం.
2. ఆలయంపై జెండా: పూరీ జగన్నాథ్ ఆలయంపై ఉండే హిందూ మతపు జెండాలు వీచే దిశ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఆ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి.
3. ప్రతిరోజూ జెండా మార్పు: 45 అంతస్తుల ఎత్తుగా ఉన్న ఈ ఆలయంపైకి ప్రతిరోజూ ఒక పూజారి ఎక్కి జెండాను క్రమంగా మారుస్తుంటాడు. దాదాపు 1800 ఏళ్ల నుంచి ఈ ఆచారం వస్తోంది. ఇది ఒక్క రోజు తప్పినా, అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూత పడుతుందని నమ్ముతారు.
4. సుదర్శన చక్రం: ఆలయం పై భాగాన ఉన్న 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రం పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా అభిముఖంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆలయంపై సుదర్శన చక్రాన్ని ఉంచిన తీరు ఇంజినీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది.
5. ఆలయం పై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు: ఈ ఆలయంలోని మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దీని పై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడమే. ఏ ప్రభుత్వము దీనిని నో-ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించనప్పటికీ, ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో-ఫ్లయింగ్ జోన్‌గా పరిగణించబడుతుంది.
6. ఆశ్చర్యం కలిగించే సింహద్వార రహస్యం: నాలుగు ద్వారాలు గల జగన్నాథ్ ఆలయానికి సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గంగా ఉంది. అయితే ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు సముద్రపు శబ్ద తరంగాలు స్పష్టంగా వినిపిస్తాయి. కానీ ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం అస్సలు వినిపించదు.
7. అంతుచిక్కని సముద్రపు రహస్యం: సముద్ర తీరంలో సాధారణంగా ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపుకు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో జరుగుతుంది.
8. ఆశ్చర్యపరిచే ప్రసాదం రహస్యం: పూరీ జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజూ సుమారు 2 వేల నుంచి 20 వేల వరకు భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఆలయంలో ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు. అయినప్పటికీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృథా కావడం, భక్తులకు సరిపోకపోవడం లాంటి ఘటనలు జరగలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రసాదాన్ని తయారు చేయడానికి ఏడు కుండలు ఒక దానిపై ఒకటి పెట్టి వండగా, కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారవడం విశేషం.