Shrinkhala Devi:శృంఖలా దేవి శక్తిపీఠం.. చరిత్ర, పురాణాలు కలగలిసిన పుణ్యక్షేత్రం
Shrinkhala Devi:పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో ఉన్న పాండువా పట్టణంలో ఉంది. ఈ పీఠం సతీదేవి శరీరంలోని ఉదర భాగం పడిన ప్రదేశంగా నమ్మబడుతుంది.

Shrinkhala Devi
శక్తి పీఠాలు హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా పరిగణించబడతాయి. వీటిలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శృంఖలా దేవి (Shrinkhala Devi)శక్తి పీఠం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో ఉన్న పాండువా పట్టణంలో ఉంది. ఈ పీఠం సతీదేవి శరీరంలోని ఉదర భాగం పడిన ప్రదేశంగా నమ్మబడుతుంది. ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అనేక కథలు, తాంత్రిక సంప్రదాయాలు, పురాణాల సమ్మేళనం.
దక్ష యాగం కథ ప్రకారం, దక్షుడు తన యాగంలో శివుడిని అవమానించడంతో కోపంతో సతీదేవి యాగ అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది. తన భార్య మరణాన్ని తట్టుకోలేని శివుడు, సతీదేవి దేహాన్ని తన భుజాలపై మోసుకుని తాండవం చేస్తాడు. శివుడి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు భయపడి విష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి దేహాన్ని ముక్కలు చేస్తాడు. ఆ దేహ భాగాలు భూమి మీద పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా వెలిశాయి. అలా సతీదేవి ఉదర భాగం పడిన ప్రదేశమే ఈ శృంఖలా దేవి (Shrinkhala Devi)శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయాన్ని గొప్ప మహర్షి అయిన ఋష్యశృంగుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఋష్యశృంగుడు స్వచ్ఛమైన మనస్సు, గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉన్న మహర్షిగా ప్రసిద్ధి చెందారు. ఆయన గాఢ భక్తితో శృంఖలా దేవిని ఆరాధించి ఈ పీఠాన్ని స్థాపించారని నమ్మకం. ‘శృంఖలా’ అనే పదానికి ‘సంకెళ్ళు’ లేదా ‘గొలుసు’ అని అర్థం. ఈ దేవి తన భక్తులకు కష్టాలు, బంధనాలు, సంకెళ్ళను తొలగించి, మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు.

దురదృష్టవశాత్తు, కాలక్రమేణా , మధ్యయుగ కాలంలో జరిగిన దాడుల కారణంగా, పురాతన శృంఖలా దేవి ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం, ఆ పురాతన ఆలయ అవశేషాలు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఇప్పుడు ఒక ఇస్లామిక్ మినారెట్, బరి మస్జిద్ మినార్ ఉన్నది. అయినా సరే స్థానిక ప్రజలు , భక్తులు ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ పవిత్రమైనదిగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ఇప్పుడు లేకపోయినా, దాని చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇప్పటికీ భక్తులలో సజీవంగా ఉంది.
శృంఖలా దేవి(Shrinkhala Devi) శక్తి పీఠం గురించి కొన్ని విభిన్న కథనాలు, సందేహాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కొన్ని పురాణ కథనాల ప్రకారం, సతీదేవి శక్తి మొదట ఇక్కడ నిలిచినా కూడా, తర్వాత అది గంగా సాగర్ దగ్గరికి లేదా కర్ణాటకలోని శృంగేరి హిల్ దగ్గరికి తరలించబడింది అని చెబుతారు. ఋష్యశృంగుడు శృతి శక్తిని సంపాదించి, దానిని శృంగేరి కొండకు తీసుకువచ్చారని కూడా పౌరాణిక గ్రంథాలు పేర్కొంటాయి. అయినా సరే, ప్రాథమికంగా ఈ పీఠం యొక్క ప్రామాణిక స్థలం పశ్చిమ బెంగాల్‌లోని పాండువాగానే గుర్తించబడింది.
పాండువా పట్టణం కోల్‌కతా నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ప్రైవేట్ వాహనాలు , స్థానిక రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. చరిత్ర, మతం, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఉన్న మినార్, పురాతన ఆలయ అవశేషాలు ఒకే చోట ఉండటం వల్ల ఇది మత సామరస్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.