Simhachalam:విశాఖపట్నం(Visakhapatnam) సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి లేదా అప్పన్నస్వామి(Appanna Swamy) గిరి ప్రదక్షిణ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఈ ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల తాకిడితో సింహగిరి రహదారులు కిక్కిరిసిపోయాయి.
Simhachalam:
గిరి ప్రదక్షిణ వివరాలు, మార్గం
ఈరోజు (జూలై 9, 2025) ఉదయం 9 గంటలకు కొండ దిగువన ఉన్న తొలి పావంచా వద్ద గిరి ప్రదక్షిణ మొదలైంది. ఇది రేపు (జూలై 10) సాయంత్రం తిరిగి తొలి పావంచాకు చేరుకోవడంతో ప్రదక్షిణ పూర్తవుతుంది. భక్తులు మొత్తం 32 కిలోమీటర్ల మేర కాలినడకన ఈ ప్రదక్షిణను పూర్తి చేస్తారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచలం ప్రాంతం అంతా గోవింద నామ స్మరణతో మార్మోగిపోతోంది. వేలాది మంది భక్తులు, చిన్నాపెద్దా తేడా లేకుండా, ఎంతో ఉత్సాహంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
సింహాచలం గిరి ప్రదక్షిణ (Simhachalam Giripradakshina) మార్గం తొలి పావంచా వద్ద ప్రారంభమై, అడవివరం, ముడుసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం కూడలి, సీతమ్మధార, మాధవధార, NAD జంక్షన్, గోపాలపట్నం, పాతగోశాల మీదుగా సాగి, తిరిగి సింహాచలం అప్పన్న ఆలయానికి చేరుకుంటుంది. భక్తులు రేపు తెల్లవారుజాము వరకు ప్రదక్షిణ కొనసాగించనున్నారు. ప్రదక్షిణ ముగిసిన అనంతరం, ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్నస్వామివారికి తుది విడత చందనోత్సవం జరగనుంది.
భారీ ఏర్పాట్లు, నిరంతర పర్యవేక్షణ
భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం, భద్రత దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసు అధికారులు గిరి ప్రదక్షిణ మార్గాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు మంచినీరు, వైద్య సేవలు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు వంటి సౌకర్యాలు కల్పించారు.