Yaganti
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో, ఎర్రమలై కొండల మధ్యలో దాగి ఉన్న ఒక అద్భుతం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కేవలం ఒక ప్రాచీన ఆలయం మాత్రమే కాదు, ఒక అద్భుతం మన కళ్ల ముందు జరుగుతోంది. అదే పెరుగుతున్న నందీశ్వరుడు (బసవయ్య). ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు, భక్తులు, శాస్త్రవేత్తలు కూడా దీనిని ఒక నిజమైన అద్భుతంగా నమ్ముతున్నారు.
యాగంటి(Yaganti) ఆలయం 5వ మరియు 6వ శతాబ్దాల మధ్య నిర్మించబడినది, ఆ కాలంలో పల్లవులు, చోళులు, చాళుక్యుల రాజులు దీనికి తోడ్పాటు అందించారు. 15వ శతాబ్దంలో, విజయనగర సామ్రాజ్యంలోని సంగమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్క రాయలు ఈ ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయాల ప్రకారం నిర్మించినా.. ఇక్కడ శివుడు , పార్వతి దేవి ఒకే విగ్రహంలో అర్ధనారీశ్వర రూపంలో కొలువై ఉన్నారు. ఈ ప్రత్యేకత ఆలయానికి ఒక విశిష్టతను తెస్తుంది.
స్థల పురాణం ప్రకారం, మహర్షి అగస్త్యుడు ఈ ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని భావించారు. అయితే, విగ్రహం యొక్క కాలి గోరు దెబ్బతినడంతో ఆయన నిరాశ చెందారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఈ ప్రదేశం కైలాసాన్ని పోలి ఉందని, ఇది శివాలయం నిర్మాణానికి అనువైనదని సూచించారు. అగస్త్యుడి కోరిక మేరకు శివుడు , పార్వతి దేవి ఉమామహేశ్వర రూపంలో ఇక్కడ స్వయంభూ విగ్రహంలో ఆవిర్భవించారు.
యాగంటి (Yaganti) ఆలయంలోని నంది విగ్రహం నిజంగానే పెరుగుతుందని భారత పురాతత్వ శాఖ (ASI) కూడా ధృవీకరించింది. ప్రతి 20 సంవత్సరాలకు ఈ విగ్రహం సుమారు 1 అంగుళం పెరుగుతున్నట్లు వారు తమ పరిశోధనల్లో గుర్తించారు. శతాబ్దం క్రితం, భక్తులు ఈ నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఇప్పుడు విగ్రహం పరిమాణం పెరగడం వల్ల ప్రదక్షిణలకు అవకాశం లేకుండా పోయింది. ఈ పెరుగుదల కారణంగా ఆలయ అధికారులు ఒక స్తంభాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది.
ఈ అద్భుతానికి శాస్త్రీయ కారణాలను కూడా అన్వేషించారు. మైన్స్ అండ్ జియాలజీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సి. మోహన్ రావు గారి ప్రకారం, ఈ విగ్రహాన్ని తయారు చేసిన రాయిలో సిలికా,ఇనుము కణాలు ఉన్నాయి. వాతావరణంలో జరిగే రసాయనిక చర్యల వల్ల ఈ రాయిలో ఉండే సిలికా గ్రాన్యూల్స్‌గా మారి విస్తరిస్తుంది. అందుకే ఈ విగ్రహం పెరుగుతున్నట్లు వారు చెబుతున్నారు.
పెరుగుతున్న ఈ బసవయ్య గురించి గొప్ప సన్యాసి ,కాలజ్ఞాని అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. కలియుగం ముగిసే సమయంలో ఈ బసవయ్యకు జీవం వచ్చి గర్జిస్తాడని, అది యుగాంతాన్ని సూచిస్తుందని చెప్పారు. అంతేకాక, యాగంటిలోని మూడు గుహల నుండి లక్షలాది గుర్రాలు బయటికి వచ్చి, కల్కి అవతారమైన శ్రీ విష్ణువుకు సేవ చేస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి ఎర్రమలై కొండల నుండి నంది విగ్రహం ముఖం ద్వారా నిరంతరంగా నీరు ప్రవహిస్తుంది. ఈ నీరు సంవత్సరం పొడవునా స్వచ్ఛంగా, తాజాగానే ఉంటుంది. భక్తులు ఈ నీటిలో స్నానం చేసి ఆలయాన్ని దర్శించుకుంటారు.యాగంటిలో కాకులు కనిపించవు. పురాణం ప్రకారం, అగస్త్య ముని తన తపస్సు సమయంలో కాకులు ఆటంకం కలిగించడంతో, కాకులు ఈ ప్రాంతంలోకి రాకూడదని శాపం ఇచ్చారు.అలాగే ఆలయం చుట్టూ అగస్త్య గుహ, వేంకటేశ్వర గుహ , వీరబ్రహ్మం గుహ వంటివి ఉన్నాయి. ఈ గుహలలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానం రాశారని చెబుతారు.
యాగంటి (Yaganti) బసవయ్య యొక్క పెరుగుతున్న విగ్రహం ఒక శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యంగా మిగిలిపోయింది. ఈ అద్భుతం, చరిత్ర, పురాణాలు , భక్తితో కలిసి యాగంటి ఆలయాన్ని ఒక ప్రత్యేకమైన యాత్రా క్షేత్రంగా మార్చాయి. ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో ఆరాధించబడటం మరొక అరుదైన విశేషం. యాగంటి సందర్శన భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, సహజ సౌందర్యాన్ని, చారిత్రక గొప్పతనాన్ని అందిస్తుంది.