Dhari Devi
ఉత్తరాఖండ్‌లోని అలకనంద నది ఒడ్డున ఉన్న ధారి దేవి(Dhari Devi) ఆలయం ఒక అద్భుతాల నిలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, అనేక పురాణాలు, రహస్యాలు, భయంకరమైన వాస్తవాలతో ముడిపడి ఉన్న ఒక శక్తిపీఠం. ఈ ఆలయం 108 శక్తి పీఠాలలో ఒకటిగా దేవీ భాగవతంలో పేర్కొనబడింది. ఇక్కడ కొలువైన అమ్మవారు అలకనంద నది ప్రవాహాన్ని నియంత్రిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ధారి దేవిని(Dhari Devi) భక్తితో కొలిచినవారిని అనుగ్రహిస్తుందని, కానీ ఆమెను ధిక్కరిస్తే భయంకరమైన కీడు జరుగుతుందని అక్కడి స్థానికులు చెబుతారు. ఈ నమ్మకానికి సాక్ష్యంగా వారు రెండు సంఘటనలను ఉదాహరణలుగా చూపుతారు. మొదటిది, క్రీ.శ. 1882లో కేదారనాథ్ ప్రాంతాన్ని పడగొట్టడానికి ఒక రాజు ప్రయత్నించగా, కొండ చరియలు విరిగిపడి ఆ ప్రాంతం నాశనమైందని… ఆ సంఘటనతో భయపడిన రాజు పారిపోయాడని చెబుతారు.
అంతేకాదు, 2013లో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అమ్మవారి విగ్రహాన్ని అసలు స్థలం నుంచి తొలగించారు. ఆ మరుసటి రోజే అలకనంద నది ఉగ్రరూపం దాల్చి, భయంకరమైన వరదలు సృష్టించిందని అంటారు.. ఈ వరదల కారణంగా దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన సంఘటన తర్వాత, విగ్రహాన్ని మళ్లీ పాత స్థానంలో ప్రతిష్టించారు, ఆ తర్వాత నది శాంతించిందని పురరాణాలు చెబుతాయి.
ఈ ఆలయంలో అమ్మవారికి ఉన్న మరో అద్భుతమైన మహిమ.. ఆమె రూపం మారడం. ధారి దేవి ఉదయం ఒక బాలికలా మెరుస్తుంది. మధ్యాహ్నం ఆమె రూపం నడివయసు మహిళలా మారుతుంది. సాయంత్రం వేళ, ఆమె వృద్ధురాలిగా శాంత రూపాన్ని ధరిస్తుంది. ఈ మహిమాన్వితమైన రూపాంతరాలు చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవాలయం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, ప్రకృతితో, దైవశక్తితో ముడిపడిన ఒక రహస్య గమ్యం.