Akshaya Patra
భారతీయ సంస్కృతిలో అన్నదానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దానం చేయడంలో ఎన్నో రకాలు ఉన్నా, అన్నదానం మాత్రమే గ్రహీతను ‘తృప్తి’ పరిచేది. దీనికి పురాణ కాలం నుంచి ఒక గొప్ప ఆచారం ఉంది.
మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, వారి దగ్గరికి వచ్చే అతిథులకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వారికి కష్టంగా మారింది. అప్పుడు ద్రౌపది సూర్యదేవుడిని ప్రార్థించగా, ఆయన ఒక అద్భుతమైన అక్షయ పాత్రను (Akshaya Patra )ప్రసాదించాడు.
ఈ పాత్రలో వండిన ఆహారం ద్రౌపది భోజనం చేసే వరకు ఎంత మందికైనా సరిపోతుంది అలాగే అది ఎప్పటికీ అయిపోదు. దీని ద్వారా మనకు అందే సందేశం ఏంటంటే, నిస్వార్థంగా పదిమందికి పెట్టే అలవాటు ఉంటే, భగవంతుడు మనల్ని ఎప్పుడూ ఆకలితో ఉంచడని.
ఆధ్యాత్మికంగా అన్నదానాన్ని మహాయజ్ఞంగా పిలుస్తారు. మన పురాణాల ప్రకారం, ఒక వ్యక్తి చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని చెబుతారు. అన్నం పెట్టడం అంటే కేవలం కడుపు నింపడం మాత్రమే కాదు, ఎదుటివారిలో ఉన్న ఆత్మను తృప్తి పరచడం.
అందుకే గుడికి వెళ్లినప్పుడు మనకు అన్నప్రసాదాన్ని ఇస్తారు. భగవంతుని ప్రసాదం స్వీకరించడం వల్ల మనలోని అరిషడ్వర్గాలు నశిస్తాయని భక్తుల నమ్ముతారు.
కాశీ అన్నపూర్ణా దేవిని మనం దర్శించుకున్నప్పుడు ఆమె చేతిలో గరిటె , అన్నపాత్ర ఉంటాయి. లోకంలోని సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించే తల్లిగా ఆమెను పూజిస్తాం. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనకు తిండి దొరుకుతుందనేది నిజం. అందుకే మనం తినే ముందు అన్నదాతా సుఖీభవ అని దీవించడం మన సంప్రదాయంలో భాగమైంది.
అందుకే ఇప్పుడు కూడా అక్షయ పాత్ర (Akshaya Patra )అనే పేరుతో ఎన్నో సేవా సంస్థలు నడుస్తున్నాయి. వేల సంఖ్యలో పేద విద్యార్థులకు, ఆసుపత్రులలోని రోగులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తూ, ఆకలి లేని సమాజం కోసం కృషి చేస్తూనే ఉన్నాయి.
అయితే పురాణాల నాటి అక్షయ పాత్ర (Akshaya Patra )మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మన దగ్గర ఉన్నది ఎంత తక్కువైనా, అందులో పంచుకుంటే అది అక్షయంగా అంటే అది ఎప్పటికీ తగ్గకుండా పెరుగుతూనే ఉంటుంది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఊరికే అనలేదు. ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు తింటున్న వారి ముఖంలో కనిపించే ఆనందం, మనకు లభించే పుణ్యం వేల కోట్ల రూపాయలతో సమానం.
ఈ సేవా గుణాన్ని పెంచుకోవడం ద్వారానే మనం నిజమైన భక్తిని చాటుకోగలం. ప్రతి ఇంట్లోనూ అక్షయ పాత్ర (Akshaya Patra )ఉండాలంటే, ప్రతి ఒక్కరూ అన్నదానాన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలి అని తెలుసుకోవాలి.
