Dussehra:ఈ ఏడాది దసరా ఎప్పుడంటే..

Dussehra: దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి లోకాలను కాపాడిన రోజుగా, శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా, పాండవులు తమ ఆయుధాలను తిరిగి పొందిన రోజుగా ఈ పండుగ గురించి చెబుతారు.

Dussehra

దసరా(Dussehra)… విజయానికి, నమ్మకానికి, శుభానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ, సనాతన ధర్మంలో ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. ఆశ్వయుజ మాసం శరదృతువులో వచ్చే ఈ పవిత్ర పండుగను, తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల అనంతరం, పదవ రోజున విజయదశమిగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి లోకాలను కాపాడిన రోజుగా, శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా, పాండవులు తమ ఆయుధాలను తిరిగి పొందిన రోజుగా ఈ పండుగ గురించి చెబుతారు. ఇది అజ్ఞానంపై జ్ఞానం, అహంకారంపై వినయం, చెడుపై మంచి సాధించిన దివ్య విజయానికి సంకేతం.

ఈ సంవత్సరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా(Dussehra) శరన్నవరాత్రి ఉత్సవాలు మరింత ప్రత్యేకంగా జరగబోతున్నాయి. తిథి వృద్ధి కారణంగా, ఈ పండుగను 9 రోజులకు బదులుగా ఏకంగా 11 రోజులపాటు వైభవంగా నిర్వహించడానికి ఆలయ పాలకమండలి సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరగనున్నాయి.

నవరాత్రుల(Dussehra)లో తొలి మూడు రోజులు పార్వతీ లేదా దుర్గామాతను, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీదేవిని భక్తులు ఆరాధిస్తారు. ఈ పండుగ సందర్భంగా అమ్మవారు ప్రతి రోజు ఒక ప్రత్యేక అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

Dussehra

సెప్టెంబరు 22న శ్రీ బాల త్రిపుర సుందరి, సెప్టెంబరు 23న శ్రీ గాయత్రి దేవి, సెప్టెంబరు 24న శ్రీ అన్నపూర్ణ దేవి, సెప్టెంబరు 25న శ్రీ కాత్యాయిని దేవి, సెప్టెంబరు 26న శ్రీ మహాలక్ష్మి దేవి, సెప్టెంబరు 27న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, సెప్టెంబరు 28న శ్రీమహా చండీ దేవి, సెప్టెంబరు 29న శ్రీ సరస్వతి దేవి, సెప్టెంబరు 30న శ్రీ దుర్గా దేవి, అక్టోబరు 01న శ్రీ మహిషాసుర మర్దిని దేవి, అక్టోబర్ 02న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు కనిపించనున్నారు.

సెప్టెంబరు 29న మూల నక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాల చివరి రోజు అయిన అక్టోబరు 2న విజయదశమి నాడు, ఉదయం మహా పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించి అమ్మవారిని ఘనంగా ఊరేగిస్తారు. ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు.

ఈ దైవికమైన ఉత్సవాలు కేవలం విజయవాడకే పరిమితం కాకుండా, తెలంగాణలో బతుకమ్మ, పశ్చిమ గోదావరిలో ఏనుగుల సంబరం, విజయనగరంలో సిరిమాను ఉత్సవం వంటి వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా అపారమైన భక్తితో జరుపుకొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version