ICC Women’s World Cup
మహిళల వన్డే ప్రపంచకప్(ICC Women’s World Cup) లో భారత్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న వేళ మరో రెండు విజయాలు సాధించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఇంగ్లాండ్ పై పోరాడి ఓడిపోయింది. గత మ్యాచ్ ల తరహాలోనే ఈ సారి కూడా చేజేతులా పరాజయాన్ని చవిచూసింది. ఒకదశలో ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న భారత మహిళల జట్టు చివర్లో వరుస వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. చివర్లో అద్భుతంగా పుంజుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు 4 పరుగుల తేడాతో తమ జట్టును గట్టెక్కించారు.
ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా.. భారత్ , న్యూజిలాండ్ జట్లు మిగిలిన ఒక బెర్త్ కోసం రేసులో నిలిచాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు వన్ డౌన్ బ్యాటర్ హీథర్ నైట్ ఇన్నింగ్సే హైలెట్ గా నిలిచింది. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ సెంచరీ బాదేసింది. ఆమెతో పాటు వికెట్ కీపర్ అమీ జోన్స్ 56, కెప్టెన్ బ్రంట్ 38 రన్స్ తో రాణించారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు 50ఓవర్లలో 289 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 , శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టారు.
289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు సరైన ఆరంభం లభించలేదు. ప్రతీకా రావల్ త్వరగానే ఔటవగా.. హ్యార్లిన్ డియోల్ కూడా నిరాశపరిచింది. అయితే హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కీలక పార్టనర్ షిప్ తో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 125 పరుగులు జోడించారు. అయితే స్మృతి మంధాన 70 రన్స్ కు ఔటైనా.. దీప్తిశర్మతో కలిసి ఇన్నింగ్స్ నడిపించింది.
వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు బాల్ కో పరుగే చేయాల్సి ఉండడంతో భారత్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ చివర్లో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. లైన్ అండ్ లెంగ్త్ తో కట్టడి చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టారు. స్మృతి మంధాన 88, దీప్తి శర్మ 50, రిఛా ఘోష్ 8 రన్స్ కే ఔటవడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. తర్వాత బ్యాటర్లు అనుకున్నంత వేగంగా ఆడలేకపోయారు. పైగా మిడిల్ ఓవర్స్ లో మరోసారి ఎక్కువ డాట్ బాల్స్ ఆడడం కూడా భారత్ కొంపముంచింది.
దీంతో చివరికి భారత్ 284 పరుగులే చేయగలిగింది. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. అదే సమయంలో ఇంకా రెండు మ్యాచ్ లే ఆడాల్సిన భారత్ రెంటింటిలోనూ తప్పక గెలవాలి. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్(ICC Women’s World Cup) ఒకవిధంగా భారత్ కు క్వార్టర్ ఫైనల్ లాంటిది. కివీస్ చేతిలో ఓడితే ఇక టోర్నీ నుంచి భారత్ నిష్క్రమిస్తుంది.