India vs West Indies:విజయం చివరిరోజుకు వాయిదా గెలుపు ముంగిట భారత్
India vs West Indies:వెస్టిండీస్ తో రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది.

India vs West Indies
వెస్టిండీస్ తో రెండో టెస్టు(India vs West Indies)లో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. విండీస్ అసాధారణ పోరాటంతో మ్యాచ్(India vs West Indies) ఐదో రోజే ఫలితం తేలనుంది. ఊహించినట్టుగానే భారత్ విజయానికి చేరువైంది. విండీస్ బ్యాటర్లు క్యాంప్ బెల్, షై హోప్ అద్భుత పోరాటం నాలుగోరోజు హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఓవర్ నైట్ స్కోరు 173 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ తొలి సెషన్ లో కేవలం 1 వికెట్ మాత్రమే చేజార్చుకుంది. సెంచరీతో అదరగొట్టిన క్యాంప్ బెల్ 115 పరుగులకు ఔటయ్యాడు.

హోప్ తో కలిసి విండీస్ ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించాడు. లంచ్ తర్వాత షై హోప్ మిగిలిన బాధ్యత తీసుకున్నాడు. అతను కూడా శతకం బాదడంతో ఒక దశలో విండీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ లంచ్ బ్రేక్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. విండీస్ వరుస వికెట్లు తీసి త్వరగానే మ్యాచ్ ముగించేలా కనిపించారు. కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మ్యాజిక్ తో వెంటవెంటనే 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ టార్గెట్ 50 లోపే ఉంటుందని అంతా అనుకున్నారు.

ఈ దశలో టెయిలెండర్లు గ్రీవ్స్ , సీల్స్ భారత బౌలర్లను విసిగించారు. క్రీజులో పాతుకుపోయి సింగిల్స్ తీస్తూ ఆధిక్యాన్ని వంద దాటించారు. ఎంత ప్రయత్నించినా టీబ్రేక్ లోపు వీరిద్దరినీ భారత్ బౌలర్లు ఔట్ చేయలేకపోయారు. టీ బ్రేక్ తర్వాత బుమ్రా సీల్స్ ను క్లీన్ బౌల్డ్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ కు 390 పరుగుల దగ్గర తెరపడింది. గ్రీవ్స్ హాఫ్ సెంచరీతో అదరగొడితే… సీల్స్ 32 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరి వికెట్ కు 79 పరుగులు జోడించారు. అలాగే ఈ సిరీస్ లో తొలిసారి ఇద్దరు విండీస్ బ్యాటర్లు సెంచరీ సాధించారు. అలాగే విండీస్ రెండు ఇన్నింగ్స్ లలోనూ 200 ప్లస్ స్కోర్లు సాధించడం కూడా ఈసిరీస్ లో ఇదే తొలిసారి. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 3 , సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
121 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా త్వరగానే జైస్వాల్ వికెట్ కోల్పోయింది. వేగంగా ఆడాలన్న తాపత్రయంలో జైస్వాల్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. దీంతో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 30 , కేఎల్ రాహుల్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయం కోసం భారత్ ఇంకా 58 పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదో రోజు తొలి సెషన్ లోనే మ్యాచ్ పూర్తి కానుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేయబోతోంది. డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ రేసులో నిలిచేందుకు ఈ సిరీస్ విజయం భారత్ కు దోహదపడుతుందని చెప్పొచ్చు.