IPL Auction 2026
ఐపీఎల్ 2026 వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 16న అబుదాబీ వేదికగా మినీ వేలం జరగబోతోంది. దీని కోసం 359 మంది ప్లేయర్లును బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇప్పుడు వేలం(IPL Auction 2026)లో ఎవరికి భారీ ధర పలుకుతుందన్న దానిపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఎప్పటిలానే ఆసీస్ క్రికెటర్లకు జాక్ పాట్ తగులుతుందని అంచనా వేస్తున్నారు. మినీ వేలంలో ఈ సారి ఆసీస్ ఆల్ రౌండర్ క్రిస్ గ్రీన్ భారీ ధర పలుకుతాడని భావిస్తున్నారు. గాయం కారణంగా గత సీజన్ లో అతను ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత మాత్రం పొట్టి క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు.
2024 సీజన్ లో ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన గ్రీన్ 255 రన్స్ చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. దీంతో ప్రస్తుతం అతని ఫామ్ ప్రకారం చూస్తే మినీ వేలం(IPL Auction 2026)లో 20 కోట్ల వరకూ పలుకుతాడని జోస్యం చెబుతున్నారు. మనీ పర్స్ ఎక్కువగా ఉన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ గ్రీన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. మరో ఆసీస్ ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ కూడా మంచి ధర పలకడం ఖాయం. గతేడాది ఆర్సీబీ తరఫున ఆడిన లివింగ్‌స్టోన్ ను ఆ ఫ్రాంచైజీ వేలంలోకి వదిలేసింది. బౌలింగ్ చేయడంతో పాటు ఫినిషర్‌గానూ రాణించే అతడికి భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే లంక పేసర్ మహేశ్ పతిరణ కోసం కూడా గట్టిపోటీ నెలకొంది. నిజానికి చెన్నై పతిరణను విడుదల చేస్తుందని చాలామంది అనుకోలేదు. ఆశ్చర్యకరంగా సీఎస్కే అతన్ని రిలీజ్ చేసింది. గత సీజన్ లో అంచనాలు అందుకోలేకపోవడమే దీనికి కారణం. యార్కర్ దిట్టగా పేరున్న పతిరణ కూడా వేలం(IPL Auction 2026)లో భారీ ధర పలికే ఛాన్సుంది. అటు భారత నుంచి లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు జాక్ పాట్ తగిలే ఛాన్సుంది. మినీ వేలానికి ముందే అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ వదిలేసింది.
మిడిల్ ఓవర్లలో మ్యాచ్ ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్నబిష్ణోయ్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడొచ్చు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అతడిని దక్కించుకునే ప్రయత్నించొచ్చు. అలాగే వెంకటేశ్ అయ్యర్, పృథ్వీషాలు కూడా ఫ్రాంఛైజీలను దృష్టిలో ఉన్నారు. వెంకటేశ్ అయ్యర్ ను గతంలో కంటే తక్కువ ధరకు దక్కించుకునే ప్లాన్ కేకేఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. గత సీజన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన పృథ్వీషా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. వీరితో పాటు దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్ళు, అండర్ 19 ప్లేయర్స్ కూడా జాక్ పాట్ కొట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
