Jasprit Bumrah
ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో ప్రతీ మ్యాచ్ కీలకమే. ఎందుకంటే చిన్న జట్లను సైతం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. షార్ట్ ఫార్మాట్ కావడంతో సంచలనాలు నమోదవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అందుకే భారత్ ప్రతీ మ్యాచ్ కూ పూర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతోంది. పైగా అమెరికాతో మ్యాచ్ లో మన బ్యాటర్లు ఎలా తడబడ్డారో చూశాం. అందుకే రెండో మ్యాచ్ లో పసికూన నమీబియాతోనే ఆడుతున్నా కూడా కీలక ఆటగాళ్లెవరకీ కూడా రెస్ట్ లేదు.
ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత స్టార్ పేసర్ జస్ప్పీత్ బుమ్రా(Jasprit Bumrah) తుది జట్టులోకి రానున్నాడు. వైరల్ ఫీవర్ కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన జస్ప్పీత్ బుమ్రా(Jasprit Bumrah) ఇప్పుడూ పూర్తిగా కోలుకోవడంతో నమీబియాపై బరిలోకి దిగనున్నాడు. దీంతో సిరాజ్ లేదా అర్షదీప్ సింగ్ లలో ఒకరిపై వేటు పడనుంది. హర్షిత్ రాణా గాయంతో దూరమైన వేళ అనూహ్యంగా పిలుపు అందుకుని వచ్చిన సిరాజ్ అమెరికాపై అదరగొట్టాడు.
3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఫామ్ లో ఉన్న సిరాజ్ ను పక్కన పెడతారా.. లేక రొటేషన్ పద్ధతిలో అర్షదీప్ ను తప్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిరాజ్ ను తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.మరోవైపు వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకున్నా.. తుది జట్టులో ఆడిస్తారా లేదా అనేది చూడాలి. ఆదివారం పాక్ తో మ్యాచ్ ఉండడంతో వాషింగ్టన్ సుందర్ ను హడావుడిగా ఆడించే అవకాశాలు కాస్త తక్కువగానే ఉన్నాయి.
ఇక ఓపెనింగ్ కాంబినేషన్ ను మార్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడీనే కొనసాగించనున్నారు. దీంతో సంజూ శాంసన్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కివీస్ తో సిరీస్ లో వరుస అవకాశాలు ఇచ్చినా పూర్తిగా నిరాశపరిచిన సంజూ ఓపెనింగ్ స్థానాన్ని ఇప్పుడు ఇషాన్ దక్కించుకున్నాడు. మిగిలిన కాంబినేషన్ లో మార్పులు జరిగే అవకాశాలు లేదు.
అయితే ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో కుల్దీప్ ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం రింకూ సింగ్ నే కొనసాగిస్తారు. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్ లో నిరాశపరిచిన కీలక బ్యాటర్లు నమీబియాపై రెచ్చిపోవాలని ఎదురుచూస్తున్నారు. అభిషేక్ , ఇషాన్ తో పాటు తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా పాక్ తో మ్యాచ్ కు ముందు పూర్తి ఫామ్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం మీద చిన్న జట్టే అయినా.. నమీబియాను టీమిండియా తేలిగ్గా తీసుకోవడం లేదు. భారీ విజయంతోనే పాక్ తో పోరుకు రెడీ అవ్వాలని భావిస్తోంది.
