Messi: మళ్లీ వచ్చి మ్యాచ్ ఆడతా..భారత్ ఫ్యాన్స్‌కు మెస్సీ హామీ

Messi: కోలకత్తా ఘటన అనుభవంతో మిగిలిన మూడు నగరాల్లోనూ అత్యంత వకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో మెస్సీ టూర్ ప్రశాంతంగా ముగిసింది.

Messi

సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Messi) భారత్ పర్యటన ముగిసింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా కోల్ కతా, హైదరాబాద్, ముంబైలలో ఫ్యాన్స్ ను అలరించిన మెస్సీ చివరిరోజు న్యూఢిల్లీలో నందడి చేశాడు. ఊహించినట్టగానే ఈ సాకర్ దిగ్గజానికి న్యూఢిల్లీలోనూ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కోలకత్తా ఘటన అనుభవంతో మిగిలిన మూడు నగరాల్లోనూ అత్యంత వకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో మెస్సీ టూర్ ప్రశాంతంగా ముగిసింది.

చివరిరోజు న్యూఢిల్లీలో మెస్సీ(Messi)తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వీఐపీలు క్యూ కట్టినట్టు తెలుస్తోంది. మెస్సీతో కరచాలనం, ఫోటో అవకాశం కోసం వీరంతా కోటి రూపాయల వరకూ చెల్లించేందుకు సిద్ధపడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత స్టేడియానికి వచ్చిన మెస్సీకి అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

ప్లేయర్స్ తో కరచాలనం చేశాక..స్టేడియం అంతటా తిరుగుతూ ఫ్యాన్స్‌కు మెస్సీ అభివాదం చేసాడు. తర్వాత ఐసీసీ చైర్మన్ జైపా మెస్సీని కలిసి భారత క్రికెట్ జట్టు జెర్సీలను, బ్యాట్ ను బహుమతిగా అందజేశాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్, యూఎస్ఎ మ్యాచ్ వీక్షించేందుకు రావాలని ఆహ్వానిస్తూ దానికి సంబంధించిన టికెట్ బహకరించాడు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా హాజరయ్యారు.

Messi

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ మెస్సీ మాట్లాడాడు. తాము మరోసారి భారత్ కు వస్తామని. అప్పుడు కచ్చితంగా ఒక మ్యాచ్ ఆడతామని మాట ఇచ్చాడు. ఈ మూడు రోజుల పర్యటనలో తమపై భారత అభిమానులు, ప్రజలు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు చెప్పాడు. ఎంతో ప్రేమను చూపించిన ఇలాంటి అభిమానులను కలవడం మరిచిపోలేని అనుభవంగా చెప్పుకొచ్చాడు.

తక్కువ రోజుల్లోనే పర్యటన ముగిసినా అంతులేని ప్రేమ లభించిందంటూ మెస్సీ వ్యాఖ్యానించాడు. స్టేడియాలకు ఇంతటి భారీ స్థాయిలో అందరూ తరలివచ్చి స్వాగతం పలకడం తాము ఎన్నటికీ మరిచిపోలేమని చెప్పాడు. ఏదో ఒక సందర్భంలో మరోసారి వచ్చి కచ్చితంగా మ్యాచ్ ఆడతామని చెబుతూ ముగించాడు.

ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారం మెస్సీ (Messi)చివరిరోజు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం తర్వాత మరో ప్రైవేట్ ఈవెంట్ లో మెస్సీ భారత క్రికెటర్ రోహిత్ శర్మ, బాక్సర్ నిఖత్ జరీన్ తో పాటు మరికొందరు స్పోర్ట్స్ సెలబ్రిటీలను కలిసాడు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version