Shafali Verma: దంచికొట్టిన షెఫాలీ వర్మ.. రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం

Shafali Verma: బౌలింగ్ లో వైష్ణవి శర్మ, శ్రీచరణి. బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ (Shafali Verma)మెరుపులు హైలైట్ గా నిలిచాయి. మొదట బ్యాటింగ్ కు శ్రీలంక ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది.

Shafali Verma

సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత వుమెన్స్ టీమ్ తాజాగా శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ లో దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ తరహాలోనే రెండో టీ ట్వంటీలోనూ వన్ సైడ్ విక్టరీ అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

బౌలింగ్ లో వైష్ణవి శర్మ, శ్రీచరణి. బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ (Shafali Verma)మెరుపులు హైలైట్ గా నిలిచాయి. మొదట బ్యాటింగ్ కు శ్రీలంక ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గుణరత్నే తొలి ఓవర్లోనే ఔటవగా.. దూకుడుగా ఆడుతున్న చమరి ఆటపట్టును స్వేహరాణా పెవిలియన్ కు పంపింది. అయితే తర్వాత హాసిని పెరీరా, హర్షిత కాసేపు నిలకడగా ఆడడంతో శ్రీలంక మంచి స్కోరు సాధించేలా కనిపించింది.

10 ఓవర్ల తర్వాత భారత బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు వైష్ణవి శర్మ, శ్రీచరణి కీలక సమయాల్లో వికెట్లు కూడా పడగొట్టారు. ఫలితంగా లంక బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో సింగిల్స్ కూడా రావడం గగనమైంది. చివరి వరకూ భారత బౌలర్లు పట్టుసడలించకుండా బౌలింగ్ చేయడంతో శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శ్రీచరణి 2 వికెట్లు , వైష్ణవి శర్మ 2 వికెట్లు క్రాంతి గౌడ్ ఒక వికెట్ , స్నేహరాణా ఒక వికెట్ పడగొట్టారు.

Shafali Verma

ఛేజింగ్ లో భారత్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(Shafali Verma), స్మృతి మంధాన తొలి వికెట్ కు 29 పరుగులు జోడించగా.. మంధాన 14 రన్స్ కు వెనుదిరిగింది.అయితే ఫామ్ లో ఉన్న షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ దుమ్మురేపారు. లంక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 27 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు.

జెమీమా 26 రన్స్ కు ఔటైనా.. షెఫాలీ దూకుడు తగ్గలేదు. హర్మన్ ప్రీత్ 10 పరుగులకు ఔటైన తర్వాత రిఛా ఘోష్ తో కలిసి షెఫాలీ(Shafali Verma) జట్టు విజయాన్ని పూర్తి చేసింది. షెఫాలీ దూకుడుతో భారత్ 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. షెఫాలీ వర్మ(Shafali Verma) 34 బంతుల్లోనే 11 ఫోర్లు,1 సిక్సర్ తో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భారత మహిళల జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో తర్వాతి మ్యాచ్ శుక్రవారం తిరువనంతపురంలో జరుగుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version