Shreyas Iyer
భారత క్రికెట్ జట్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)పరిస్థితి సీరియస్ గా ఉంది. ప్రస్తుతం సిడ్నీలోనే ఒక హాస్పిటల్ ఐసీయూలో శ్రేయాస్ ను చేర్చారు. క్యాచ్ అందుకునే క్రమంలో బలంగా గ్రౌండ్ కు గుద్దుకోవడంతో నొప్పితో విలవిలలాడాడు. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకుంటుండగా..అదుపు తప్పిన అయ్యర్.. ఎడమవైపు పడిపోయాడు.
దాంతో అతని ఎడమ పక్కటెముకల్లో అంతర్గత గాయమైంది. మొదట స్కానింగ్ కోసం హాస్పిటల్ కు పంపించారు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతని పరిస్థితిని మానిటర్ చేస్తూ ఉంది. టెస్ట్‌ల అనంతరం శ్రేయస్ అయ్యర్ హోటల్ గదికి తిరిగి వచ్చాడు. అతనికి మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు కూడా తెలిసింది. దీంతో సౌతాఫ్రికా సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని కూడా వార్తలు వచ్చాయి.
అయితే టీట్వంటీ సిరీస్ కోసం భారత జట్టు కాన్ బెర్రాకు బయలుదేరుతుండగా.. శ్రేయాస్ మళ్ళీ నొప్పితో ఇబ్బందిపడ్డాడు. హుటాహుటిన హస్పిటల్ కు తరలించగా అంతర్గతంగా రక్తస్రావమైనట్టు గుర్తించారు. దీంతో శ్రేయాస్ ను వెంటనే ఐసీయూకు తరలించారు. కాన్ బెర్రాకు ఆటగాళ్ళు వెళ్ళిపోగా.. బీసీసీఐ పర్సనల్ డాక్టర్ ప్రస్తుతం శ్రేయాస్ దగ్గరే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాడు.
వైద్యుల రిపోర్టుల ప్రకారం ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగానై అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రేయాస్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ మొత్తం ఘటనపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయాస్(Shreyas Iyer) మరో వారం లేదా 10 రోజుల వరకూ సిడ్నీ హాస్పిటల్ లోనే ఉండే అవకాశాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన శ్రేయాస్ కు ఆసీస్ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది.
రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఇప్పుడు గాయంతో ఇలా దూరమవడం అభిమానులకు బాధ కలిగిస్తోంది. గత ఏడాది కూడా వెన్నునొప్పితో దూరమై సర్జరీ చేయించుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్ లో ఫామ్ అందుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం 2027 వన్డే ప్రపంచకప్ మిడిలార్డర్ లో కీలక బ్యాటర్ గా అతనికి ప్రాధాన్యత ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రానున్న సౌతాఫ్రికా సిరీస్ లో శ్రేయాస్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో సిరీస్ కూడా వెంటనే జరగనుండడంతో ఎప్పటిలోపు శ్రేయాస్ కోలుకుంటాడనేది చూడాలి.
