Suryakumar Yadav
టీ ట్వంటీ ప్రపంచకప్ కు ఇంకా కొద్ది గంటల్లో తెరలేవబోతోంది. సాధారణంగా ఐసీసీ నిర్వహించే మెగాటోర్నీలు జరిగినప్పుడు టైటిల్ ఫేవరెట్.. ఏ జట్టు ఎలా ఆడుతుందన్న చర్చే జరుగుతుంటుంది. కానీ ఈ సారి ఆఫ్ ది ఫీల్డ్ అంశాలే వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ తో క్రికెట్ బోర్డు వైఖరి కారణంగా బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్లు తలపట్టుకుంటున్నారు. ఫిబ్రవరి 15న భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్టు పాక్ ప్రకటించింది.
పాక్ ప్రభుత్వం ఆదేశాలతో భారత్ మ్యాచ్ ఆడేది లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఈ అంశంపై స్పందించాడు. మెగాటోర్నీకి ముందు జరిగి కెప్టెన్ల మీడియా సమావేశంలో సూర్య దీనిపై మాట్లాడాడు. షెడ్యూల్ ప్రకారమే తాము కొలంబోకు వెళుతున్నట్టు స్పష్టం చేశాడు. ఈ విషయంలో తాము పూర్తి క్లారిటీతో ఉన్నామని చెప్పేశాడు. పాక్ తో మ్యాచ్ ఆడమని తాము ఎక్కడా చెప్పలేదని, వాళ్లే ఆడేది లేదంటున్నారని గుర్తు చేశాడు. ఐసీసీ ప్రోటోకాల్ కు అనుగుణంగా తాము మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు.
మొదట యూఎస్ఏతో , తర్వాత నమీబియాతో మ్యాచ్ లు ఆడి కొలంబోకు బయలుదేరనున్నట్టు తేల్చేశాడు. ఇప్పటికే ఫ్లైట్ కూడా బుక్ అయిందని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వెల్లడించాడు. ఈ విషయంలో తమకు ఎలాంటి గందరగోళం లేదని సూర్యకుమార్ కుండబద్దలు కొట్టాడు. వాళ్ల నిర్ణయం తన ఆధీనంలో ఉండదని, గతంలో ఆసియాకప్ వేదికగా మూడు మ్యాచ్ లు ఆడిన విషయాన్ని సూర్యకుమార్ గుర్తు చేశాడు.
ఇదిలా ఉంటే పాక్ జట్టు వెనక్కి తగ్గుతుందేమో అనుకుంటున్న వేళ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని ప్రకటించారు. బంగ్లాదేశ్ కు మద్ధతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శించారు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్ కోసం పాక్ జట్టు ఇప్పటికే కొలంబో చేరుకుంది.
భారత్ తో మ్యాచ్ తప్ప మిగిలిన మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించుకుంది. దీంతో పాక్ జట్టుకే ఎక్కువ నష్టం జరగబోతోంది. పాయింట్లు కోల్పోవడంతో పాటు సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. అలాగే బ్రాడ్ కాస్టర్లు పాక్ క్రికెట్ బోర్డును కోర్టుకు ఈడ్చే పరిస్థితి కనిపిస్తోంది. అటు ఐసీసీ కూడా పీసీబీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీనిలో భాగంగా భారీ జరిమానా విధిస్తారని భావిస్తున్నారు.
Epstein ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం..ఇంకా చాలా పేర్లు రాబోతున్నాయ్
