Super 8
టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ స్టేజ్ ముగిసింది. ఊహించినట్టుగానే సూపర్ 8(Super 8)కు టైటిల్ ఫేవరెట్లలో మెజార్టీ జట్లే ఎంట్రీ ఇచ్చాయి. గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియా నిష్క్రమణ , సూపర్-8లోకి జింబాబ్వే ఎంట్రీ తప్పిస్తే సంచలనాలు నమోదు కాలేదు. ఇప్పుడు సూపర్ 8లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో భారత్. వెస్టిండీస్, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు.. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు చోటు దక్కించుకున్నాయి.
గ్రూప్ స్టేజ్ లో తలపడిన జట్లు మళ్లీ సూపర్ 8(Super 8)లో ఢీకొనకుండా ఉండేలా ఐసీసీ ప్రీ సీడింగ్స్ ఇచ్చింది. ప్రస్తుతం రెండు గ్రూపులు కూడా సూపర్ 8లో టఫ్ గా ఉన్నాయి. గ్రూప్ 1 నుంచి ఎవరు సెమీఫైనల్ కు చేరతారనే దానిపై అప్పుడు చర్చ మొదలైంది. సహజంగానే టైటిల్ ఫేవరెట్ గా ముందున్న టీమిండియానే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.
దానికి తగ్గట్టే గ్రూప్ స్టేజ్ లో నాలుగుకు నాలుగు మ్యాచ్ లు గెలిచింది. అయితే కొన్ని సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ పేలవ ఫామ్ , తిలక్ వర్మ పూర్తిగా టచ్ లోకి రాకపోవడం, పేసర్లు భారీగా పరుగులిస్తుండడం వంటి ఇబ్బందులున్నాయి. వీటిని అధిగమిస్తే సెమీస్ చేరడం పెద్ద కష్టం కాదు.
మరోవైపు ఈ గ్రూపులో మిగిలిన జట్లను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సౌతాఫ్రికా, వెస్టిండీస్ తో పాటు తనదైన రోజును జింబాబ్వే కూడా దుమ్మురేపడం ఖాయం. ముఖ్యంగా గత కొంతకాలంగా మెగాటోర్నీల్లో సఫారీల ఆటతీరు మారింది. చోకర్స్ అన్న ముద్రను తొలగించుకుంటూ గత ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న సౌతాఫ్రికా ఈ సారి పొట్టి ప్రపంచకప్ ను ఎగరేసుకుపోవాలని ఎదురుచూస్తోంది.
అటు వెస్టిండీస్ కూడా పుంజుకుంది. విండీస్ అంటేనే టీ20 ఫార్మాట్ లో అదరగొడుతుంటుంది. బ్రేవో, పొల్లార్డ్ , రస్సెల్ లాంటి ప్లేయర్స్ లేకున్నా యువ ఆటగాళ్లతో కూడిన కరేబియన్ టీమ్ ఈ సారి బాగానే ఆడుతోంది. ఇక సంచలనాలు సృష్టిస్తూ సూపర్ 8లో అడుగుపెట్టిన జింబాబ్వే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవిధంగా ఆ జట్టు నుంచి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎందుకంటే వారిపై పెద్ద అంచనాలుండవు కాబట్టి ఒత్తిడి కూడా ఉండదు.
అందుకే స్వేచ్ఛగా ఆడుతున్న జింబాబ్వే మొదట ఆసీస్ కు షాకిచ్చింది.. తర్వాత శ్రీలంకను చిత్తు చేసింది. ఇప్పుడు సూపర్ 8లో కూడా సంచలనాలు సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతోంది. మొత్తం మీద గ్రూప్ 1 నుంచి భారత్ తో పాటు మరే జట్టు ముందంజ వేస్తుందనేది మాత్రం ఉత్కంఠ రేకేత్తిస్తోంది.
