T20 World Cup
భారత క్రికెట్ జట్టులో అప్పుడప్పుడూ పలు సంచలన నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతుంటాయి. టీ ట్వంటీ ప్రపంచకప్ (T20 World Cup) కోసం టీమిండియాను ప్రకటించినప్పుడు గిల్ ను పక్కన పెట్టడం హాట్ టాపిక్ గా నిలిచింది. పొట్టి ఫార్మాట్ కు తగ్గట్టు అతను రాణించలేకపోతున్నాడంటూ వైస్ కెప్టెన్ నే బీసీసీఐ పక్కన పెట్టేసింది. తాజాగా ఇలాంటి తరహాలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా కేవలం వన్డే ఫార్మాట్ కు మాత్రమే ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ ను అనూహ్యంగా టీ ట్వంటీ జట్టులోకి తీసుకుంది.
న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ లో మొదటి మూడు మ్యాచ్ లకు శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. గాయపడిన తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ ను ఎంపిక చేశారు. నిజానికి తిలక్ వర్మ రీప్లేస్ మెంట్ ఊహించిందే.. కానీ శ్రేయాస్ ను తీసుకుంటారని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. ఒకవేళ గంభీర్ గిల్ కు మరోసారి మద్ధతుగా నిలిచి జట్టులోకి తీసుకుంటాడని అందరూ అనుకున్నారు.
ఈ సిరీస్ మూడు మ్యాచ్ లలో గిల్ అదరగొడితే తర్వాత వరల్డ్ కప్ స్క్వాడ్ కోసం రిజర్వ్ ప్లేయర్స్ గానైనా అతన్ని తీసుకోవచ్చనే అవకాశాలు కూడా కనిపించాయి. అయితే బీసీసీఐ సెలక్టర్లు అస్సలు గిల్ ను పట్టించుకోలేదు. కనీసం ఎంపిక కోసం చర్చించినప్పుడు అతని పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు. దీంతో టీ ట్వంటీ ఫార్మాట్ లో గిల్ కథ ముగిసినట్టేనా అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తిలక్ వర్మకు కడుపు నొప్పి రావడం, తర్వాత అతని వృషణాలకు సర్జరీ చేయడం జరిగాయి. దీంతో ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్ తో మూడు టీ ట్వంటీల నుంచి తిలక్ ను తప్పించారు. ఇప్పుడు అతని స్థానంలోనే శ్రేయాస్ కు పిలుపునిచ్చారు.
శ్రేయస్ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ (T20 World cup)మ్యాచ్‌లో భారత జట్టుకు ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్లలో దుమ్మురేపుతున్నా అతన్ని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఎక్కువ సందర్భాల్లో యువ క్రికెటర్లకే ప్రాధాన్యతనివ్వడంతో శ్రేయాస్ అసలు టీ ట్వంటీ ఫార్మాట్ కు దూరమయ్యాడనే అంతా అనుకున్నారు.
ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ రాకతో భారత మిడిల్ ఆర్డర్ మరింత బలంగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు కివీస్ తో తొలి వన్డే సందర్భంగా వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. మెగాటోర్నీని దృష్టిలో ఉంచుకుని కివీస్ తో టీ20 సిరీస్ కు అతన్ని కూడా తప్పించారు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్ కు చోటు దక్కింది.
Iran vs Israel : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా..మిడిల్ ఈస్ట్ లో యుద్ధమేఘాలు
