Microsoft:భారత్‌లో రూ. 1.5 లక్షల కోట్ల మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు.. సత్య నాదెళ్ల మాస్టర్ ప్లాన్

Microsoft: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తమ కంపెనీ భారత్‌లో ఏకంగా 17.5 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

Microsoft

భారతదేశంలో AI ఫ్యూచర్‌ను (AI-First Future) బలోపేతం చేసే దిశగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)సంచలన ప్రకటన చేసింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మంగళవారం తమ కంపెనీ భారత్‌లో ఏకంగా 17.5 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది ఆసియా ఖండంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పెట్టుబడి కావడం విశేషం.

పెట్టుబడి లక్ష్యాలు..ఈ భారీ పెట్టుబడి కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా, దేశ AI ఫ్యూచర్కు అవసరమైన కీలకమైన అంశాలపై దృష్టి సారించనుంది.

AI మౌలిక సదుపాయాలు (AI Infrastructure)..అత్యాధునిక క్లౌడ్ మరియు AI అవసరాల కోసం కొత్త డేటా సెంటర్ల స్థాపన, విస్తరణ.

నైపుణ్యాభివృద్ధి (Skill Development).. రాబోయే ఐదేళ్లలో దాదాపు 10 మిలియన్ల (కోటి) మంది భారతీయులకు AI నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం.

సార్వభౌమ సామర్థ్యాలు (Sovereign Capabilities).. దేశీయంగా సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడం.

ఈ పెట్టుబడి ద్వారా భారతదేశంలో AI ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మైక్రోసాఫ్ట్(Microsoft) స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో సత్య నాదెళ్ల తన భారత పర్యటన సందర్భంగానే రాబోయే రెండేళ్లలో క్లౌడ్, AI మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధిలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు ప్రకటించారు. తాజాగా, ఈ మొత్తం మరింత భారీగా పెరిగి రూ. 1.5 లక్షల కోట్లకు చేరింది.

 

ఈ సందర్భంగా సత్య నాదెళ్ల, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం (విక్షిత్ భారత్) గా మారాలనే గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికతను సాధించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని టెక్ దిగ్గజం ప్రకటించింది.

మైక్రోసాఫ్ట్(Microsoft) తన అడ్వాంటా(I)GE ఇండియా ప్రోగ్రామ్ రెండవ ఎడిషన్‌లో భాగంగానే కోటి మందికి AI శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శిక్షణ దేశ దీర్ఘకాలిక పోటీతత్వానికి మరియు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తుంది.

మొత్తంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారడం, ముఖ్యంగా యువతలో సాంకేతిక నైపుణ్యాల పట్ల పెరుగుతున్న ఆసక్తి.. ఇలాంటి భారీ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version