Online
ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం(Online)ల ద్వారా నిత్యవసర సరుకులు, కూరగాయలు, తినుబండారాలను ఆర్డర్ చేస్తున్న వినియోగదారులు ఒక్క నిమిషం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు రెస్టారెంట్లు లేదా హోటళ్లలో కుళ్లిపోయిన లేదా నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా మనం ఆర్డర్ చేసే ఆహారంలోనూ అదే భయం వెంటాడుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన స్విగ్గి, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి వాటి నుంచి సరుకులు ఆర్డర్ చేయాలన్నా కూడా ఈ భద్రతా సమస్య భోజన ప్రియులను కలవరపెడుతోంది.
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. ఈ ఆందోళనలను నిజం చేస్తూ, తాజాగా హైదరాబాద్‌లోని పలు ఈ-కామర్స్ గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. శుక్రవారం (నవంబర్ 28, 2025) రోజు అధికారులు జెప్టో, రిలయన్స్ జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు సంబంధించిన 75 గోడౌన్లలో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో అధికారులు విస్తుపోయే వాస్తవాలను గుర్తించారు.
వెలుగులోకి వచ్చిన వాస్తవాలు.. ఈ దాడుల్లో పెద్దమొత్తంలో కుళ్లిన కూరగాయలు , చెడిపోయిన ఆహారపదార్థాలను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ-కామర్స్ ద్వారా డెలివరీ కోసం ఉంచిన ఈ సరుకులు, వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా, సుమారు వెయ్యికిపైగా మిస్ బ్రాండ్లు (Misbranded) , లేబుల్స్ లేని (Unlabelled) ఫుడ్ ప్యాకెట్లు, ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. లేబుల్స్ లేకపోవడం లేదా తప్పుగా లేబుల్ చేయడం వల్ల, వినియోగదారులు ఆహార పదార్థాల తయారీ తేదీ, గడువు తేదీ, అందులోని పదార్థాలు (Ingredients), పోషక విలువలు వంటి అత్యవసర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కోల్పోతారు. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.
ఈ దాడుల వల్ల, ఆన్‌లైన్(Online) ఆహార పంపిణీ సంస్థల గోడౌన్లలో నాణ్యత , భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకత స్పష్టంగా తెలుస్తోంది. వినియోగదారులు కూడా తాము ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ తీసుకునేటప్పుడు, వాటి నాణ్యతను, లేబులింగ్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
