Vallala Naveen Yadav
తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Vallala Naveen Yadav )బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్(Vallala Naveen Yadav )యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు.
మొదటి నుంచీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఊహించారు. అయితే హోరాహోరీ పోరు తప్పదని అంతా అనుకున్నారు. కేవలం పోస్టల్ బ్యాలెట్ లో మాత్రమే హోరాహోరీ పోరు కనిపించింది. తర్వాత మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Vallala Naveen Yadav )పూర్తి ఆధిక్యం కనబరిచారు. ఏ ఒక్క రౌండ్ లోనూ సునీత పైచేయి సాధించలేకపోయారు. ఒకవిధంగా ఈ గెలుపు కాంగ్రెస్ కు , సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ జోష్ ను ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ శ్రేణులు పనిచేశాయి.
సీఎం రేవంత్ రెడ్డి మూడుసార్లు రోడ్ షోలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. అటు బస్తీల్లో మంత్రులు, సీనియర్ నేతలు తీవ్రంగా ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర గులాబీ పార్టీ నేతలు కూడా ప్రచారం బాగానే చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. ఈ ఉపఎన్నిక ఫలితాలు తెలంగాణలో చాలా హాట్ టాపిక్ గా మారాయి. హోరాహోరీ పోరు తప్పదని అనుకున్నా కౌంటింగ్ టైమ్ లో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది.
ఈ గెలుపులో కాంగ్రెస్ కు పలు అంశాలు సహకరించాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకూ సీఏం రేవంత్ స్వయంగా పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్ లో అత్యధిక శాతం ఓట్లున్న మైనార్టీ వర్గాలను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి కేటాయించింది. అటు ఎంఐఎం కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ చేయడంతో గెలుపు మరింత సులభమైంది. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ఎట్టకేలకు మూడోసారి విజయాన్న అందుకున్నారు.
ఇదిలా ఉంటే తాజా ఉపఎన్నికలో నవీన్ యాదవ్ భారీ మెజార్టీ సాధించారు. ఈ క్రమంలో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మెజారిటీని నవీన్ యాదవ్ బ్రేక్ చేశారు. అప్పుడు మాగంటి గోపినాథ్ కు 16,337 మెజారిటీ వస్తే ఈ సారి నవీన్ యాదవ్ 24 వేలకు పైగా మెజార్టీ సాధించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయంతో గాంధీ భవన్ లో సంబరాలు అంబరాన్నంటాయి.
