Dr.Ramanatham
ఆ నెల మళ్లీ వచ్చింది.. అశ్రువులు రాలిన చోట రెండు నెత్తుటి మరకలు.. కళ్లు ఇంకెప్పుడూ తెరవనివి. విప్లవ కవి వరవరరావు తన డైరీలో రాసుకున్న ఈ మాటలు, పౌర హక్కుల యోధుడు డాక్టర్ రామనాథం, ఆయన స్నేహితుడు గోపిల అమరత్వాన్ని గుర్తు చేస్తాయి. 1985, సెప్టెంబర్ 3న వరంగల్‌లో పట్టపగలు పోలీసుల తూటాకు బలై అమరుడైన డాక్టర్ రామనాథం(Dr.Ramanatham) జీవితం, పోరాటం గురించి చాలామందికి తెలీదు.
1985 సెప్టెంబర్ 2 సాయంత్రం కాజీపేటలో సీఐ యాదగిరి రెడ్డిని పీపుల్స్ వార్ దళం కాల్చి చంపింది. దీనికి ప్రతీకారంగా పీపుల్స్ వార్ సానుభూతిపరులను హతమార్చాలనే ప్లాన్‌తో వరంగల్ ఎస్పీ అరవిందరావు ఆధ్వర్యంలో పోలీసుల బృందం బయలుదేరింది. ఆ బృందం డాక్టర్ రామనాథం క్లినిక్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు, మఫ్టీలో ఉన్న పోలీసులు కొందరు ఒక్కసారిగా క్లినిక్‌లోకి చొరబడ్డారు.
రాత్రి పూట కూడా రిక్షా కార్మికులకు, పోలీసుల పిల్లలకు ఉచితంగా వైద్యం అందించే డాక్టర్ రామనాథం(Dr.Ramanatham), పోలీసులు తనను ఏమీ చేయరని భావించారు. కానీ ఆ రోజు పోలీసులు ఎలాంటి మానవత్వాన్ని చూపించలేదు. రోగులు ఉన్న గదిని చిందరవందర చేసి, ఆయనను వెనుక గదిలో అతి దగ్గరగా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపారు. అప్పటికే వరంగల్‌లో ఇలాంటి ఘటనలు సాధారణం అయినా.. ఈ దారుణానికి లక్ష్యమైన వ్యక్తి డాక్టర్ రామనాథం కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
డాక్టర్ రామనాథం(Dr.Ramanatham) విప్లవ ప్రస్థానం 1985లో ముగిసినా.. ఆయన జీవితం విద్యార్థి దశలోనే ప్రారంభమైంది. గాంధీ మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే కమ్యూనిస్టుగా జైలు జీవితం గడిపిన డాక్టర్ రాజగోపాలన్ ఆయనకు గురువు. నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రభావంతో ఆయన విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. వరంగల్‌లో ‘ప్రజా వైద్యశాల’ను స్థాపించి, ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. అంతేకాకుండా, మావో రచనలను, ఇతర విప్లవ సాహిత్య పుస్తకాలను ముద్రించి, ప్రజల్లో చైతన్యం తెచ్చేవారు.
1976 ఎమర్జెన్సీ కాలంలో, అడవుల్లో గాయపడిన నక్సలైట్లకు చికిత్స చేస్తున్నారనే ఆరోపణతో డాక్టర్ రామనాథంను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు చిత్రహింసలు పెట్టి, తర్వాత వరంగల్ జైలుకు పంపించారు. విడుదలైన తర్వాత 1978లో పౌరహక్కుల సంఘం పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వైద్య సౌకర్యాలు లేని మారుమూల పల్లె ప్రజల కోసం ఒక ‘మెడికల్ గైడ్’ను కూడా రూపొందించారు.
నిరంతర నిర్బంధంలోనూ, పౌరహక్కుల సంఘం భూస్వాములు, పోలీసుల అకృత్యాలపై పోరాడింది. జస్టిస్ భార్గవ, ప్రొఫెసర్ రజనీ కొఠారి వంటి ప్రముఖులను తీసుకొచ్చి నిజ నిర్ధారణ కమిటీలు వేయించింది. ఈ పోరాటాలలో డాక్టర్ రామనాథం కీలక పాత్ర పోషించారు. ఆయన అమరత్వం తర్వాత, ఆయన మృతదేహాన్ని చివరిసారిగా చూసుకునేందుకు పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాలు కూడా వచ్చి నివాళులు అర్పించాయంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ప్రజల్లో ఆయనకు ఎంత గౌరవానికి ఉందో తెలుసుకోవడానికి. ఆయన అమరత్వం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, అది ఒక సిద్ధాంతానికి, ఒక పోరాటానికి సంబంధించినది.