Godavari
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి(Godavari) నది ఉద్ధృతి మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రానున్న రోజుల్లో ఇది 60 అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో, అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయన వెంటనే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నాటికి ఈ తరలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా యంత్రాంగం, ఫస్ట్ వార్నింగ్ స్థాయికి ప్రవాహం చేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తూ, రక్షణ చర్యలు చేపడుతోంది.
పరిస్థితిని అదుపు చేయడానికి జిల్లా యంత్రాంగం మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తూ, ముంపు ప్రాంతాల ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందిస్తున్నారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు జారీ చేశారు.
ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే దగ్గరలోని సురక్షిత పునరావాస కేంద్రాలకు వెళ్లాలి.వరదల సమయంలో గోదావరి (Godavari) నది వద్దకు వెళ్లడం, లేదా నీటి ప్రవాహంపై ప్రయాణం చేయడం చేయకూడదు.ప్రాణరక్షణ కోసం అన్ని సహాయక కేంద్రాల్లో ఆహారం, వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు
ఈ పరిస్థితులతో భద్రాచలం, పిన్నపాక, బుర్గంపాడు, అశ్వాపురం మండలాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భద్రాచలం వద్ద ఈ ఏడాది గోదావరికి రెండవసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం గతంలో, 2022లో 70 అడుగులకు చేరిన వరద విలయాన్ని గుర్తు చేస్తోంది.
అధికారులు ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈ వరదల ప్రభావం చుట్టుపక్కల జిల్లాలపై కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల భద్రత కోసం కొన్ని రహదారులను మూసివేయడం, బోటు ప్రయాణాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నారు.