Special Buses :పండుగకు ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 7,754 ప్రత్యేక బస్సులు రెడీ
Special Buses : ఈసారి సద్దుల బతుకమ్మ సెప్టెంబర్ 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున, పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 27వ తేదీ నుంచి బస్సుల సంఖ్యను పెంచనున్నారు.

Special Buses
బతుకమ్మ , దసరా పండుగలు దగ్గరపడుతుండటంతో.. ఈ పండుగల సందర్భంగా తమ సొంతూళ్లకు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. రవాణా సమస్యలు తలెత్తకుండా, ప్రజలందరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి 7,754 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది.
ఈ ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈసారి సద్దుల బతుకమ్మ సెప్టెంబర్ 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున, పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 27వ తేదీ నుంచి బస్సుల సంఖ్యను పెంచనున్నారు. అలాగే, పండుగలు ముగిసిన తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం అక్టోబర్ 5, 6వ తేదీలలో కూడా అవసరానికి తగినన్ని బస్సులను నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
హైదరాబాద్‌లోని ప్రధాన కేంద్రాలైన ఎంజీబీఎస్, జేబీఎస్ , సీబీఎస్ నుంచి కాకుండా, రద్దీని నియంత్రించడానికి నగరంలోని వివిధ ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా నడుస్తాయి.
ప్రయాణికుల కోసం మొత్తం 7,754 బస్సుల్లో 377 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. ఈ సదుపాయాన్ని సంస్థ అధికారిక వెబ్‌సైట్ tgsrtcbus.in లో పొందొచ్చు. అలాగే, ప్రయాణికులకు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పండుగ రోజుల్లో నడిచే ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు కొంతమేర పెరుగుతాయి. ఇది కేవలం దసరా ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. రెగ్యులర్ బస్సుల ఛార్జీలలో ఎలాంటి మార్పు ఉండదు.
ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ..ప్రయాణికులు సురక్షితమైన ప్రయాణం కోసం అనధికారిక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏదైనా సందేహాల కోసం 040-69440000 లేదా 040-23450033 నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.
ISRO:ఇస్రో కొత్త ప్రయోగం.. చంద్రయాన్-4లో రోబో, ఏఐ టెక్నాలజీ
One Comment