Hyderabad: డేంజర్‌లో హైదరాబాద్..మేలుకోకపోతే భారీ మూల్యం తప్పదు
Hyderabad: వాహనాల పొగ, నిర్మాణ రంగం నుంచి వచ్చే దుమ్ము, చెత్తను తగులబెట్టడం వల్ల గాలిలో విషపూరితమైన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి.
Hyderabad
మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే, ఎంత స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నాం అనేది ముఖ్యంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం (Air Pollution) ఆందోళనకర స్థాయికి చేరుకుంటుంది.
వాహనాల పొగ, నిర్మాణ రంగం నుంచి వచ్చే దుమ్ము, చెత్తను తగులబెట్టడం వల్ల గాలిలో విషపూరితమైన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల కేవలం శ్వాసకోశ వ్యాధులే కాదు, మనుషుల మానసిక ప్రవర్తన కూడా మారుతోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
గాలిలో కలిసి ఉన్న రసాయనాలను బట్టి మన శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతింటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
అతి సూక్ష్మ ధూళికణాలు (PM 10).. ఇవి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి నేరుగా రక్తంలో కలిసిపోతాయి. దీంతో ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు వస్తాయి.
నైట్రోజన్ ఆక్సైడ్స్.. ఇంధనం మండటం వల్ల వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్స్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి. వీటి ప్రభావం ఎక్కువైతే క్యాన్సర్ లేదా నరాల బలహీనతకు దారితీయొచ్చు.

కార్బన్ మోనాక్సైడ్.. రంగు, వాసన లేని కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీలిస్తే కళ్లు మసకబారడం, వినికిడి శక్తి తగ్గడం, తీవ్రమైన తలనొప్పి వస్తుంది.
సల్ఫర్ డయాక్సైడ్.. పారిశ్రామిక వ్యర్థాల వల్ల వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ గాలి దగ్గును పెంచుతుంది.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. కాలుష్యం అంటే కేవలం శారీరక రుగ్మతలు మాత్రమే అనుకుంటే తప్పే. కాలుష్య స్థాయి పెరిగితే మనుషుల ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయని, కుంగుబాటు (Depression), బైపోలార్ డిజార్డర్, స్క్రిజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయని అమెరికా, డెన్మార్క్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
హైదరాబాద్(Hyderabad)లో పరిస్థితి ఏంటి? అంటే.. జూ పార్క్ వంటి ప్రాంతాల్లో కూడా వాయు నాణ్యత (AQI) 160 నుంచి 200 మధ్య నమోదవుతోంది. నిజామాబాద్, కొత్తూరు వంటి ప్రాంతాల్లోనూ గాలి పరిస్థితి దారుణంగా ఉంది.
మనం(Hyderabad) ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే, రాబోయే తరాలకు మనం స్వచ్ఛమైన గాలిని అందించలేం. సాధ్యమైనంత వరకు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి, మొక్కలను నాటడం ద్వారా ఈ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.ప్రభుత్వం దీని ప్రకారం చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.



