IBomma Ravi:పోలీసుల ఆఫర్‌కు నో చెప్పిన ఐ బొమ్మ రవి..అదిరిపోయే ఫ్యూచర్ ప్లాన్

IBomma Ravi: ఇప్పటికే రవి దాదాపు లక్ష డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.80 లక్షలు) ఖర్చుపెట్టి కరేబియన్ దీవులలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని పొందినట్లు గుర్తించారు.

IBomma Ravi

కొత్త సినిమాలను అక్రమంగా పైరసీ చేసి, వాటిని తమ ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌లో ఉంచి, దీని ద్వారా సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐ బొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కేవలం పైరసీకే పరిమితం కాకుండా, వెబ్‌సైట్ యూజర్లను బెట్టింగ్ యాప్‌లకు మళ్లించడం, భారీగా డబ్బును హవాలా మార్గంలో తరలించడం, యూజర్‌ డేటాను డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టడం వంటి అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి. నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో పోలీసులకు సవాలు విసిరిన రవి(IBomma Ravi)ని ఎట్టకేలకు అరెస్ట్ చేసి, రిమాండ్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

కొద్ది రోజులుగా పోలీసులు ఐ బొమ్మ రవిని విచారిస్తున్నారు. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను కూడా అధికారులు మూసివేశారు. ఈ విచారణ సందర్భంగా, రవి అసాధారణమైన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థాపక ప్రతిభ, సైబర్ ప్రపంచంలో అతనికి ఉన్న పట్టును పోలీసులు గుర్తించారు.

రవి తెలివితేటలు, హాకింగ్ నైపుణ్యాన్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ టాలెంట్‌ను సక్రమ మార్గంలో ఉపయోగించాలని భావించి, అతనికి ఊహించని ఒక ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలోని అత్యంత కీలకమైన సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయడానికి ఆహ్వానించి.. మంచి జీతం, గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని పోలీసులు ఆఫర్ చేసినా , రవి దాన్ని వెంటనే తిరస్కరించినట్లు సమాచారం.

IBomma Ravi

దీంతో, ప్రస్తుతం ఐ బొమ్మ వెబ్‌సైట్ మూసేశారు కాబట్టి..అతని భవిష్యత్తు ప్రణాళికలు ఏంటని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడే రవి తన కొత్త లక్ష్యాన్ని వెల్లడించాడు.

ఐ బొమ్మ రవి(IBomma Ravi) తన తర్వాత లక్ష్యంగా కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాతో పాటు భారతదేశంలోని ప్రసిద్ధ వంటకాలను అక్కడ స్థానిక ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేశాడు.

అంతేకాదు, ఈ రెస్టారెంట్లకు కూడా ‘ఐ బొమ్మ’ అనే పేరునే పెడతానని రవి తెలిపాడు. కరేబియన్ దీవులలోని వివిధ దేశాలలో తన రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేసి, భారతీయ వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే తన లక్ష్యం ఈ ‘ఐ బొమ్మ రెస్టారెంట్ల’ ద్వారా వచ్చే డబ్బుతో జీవితాన్ని ఎంజాయ్ చేయడమేనని రవి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.

రవి(IBomma Ravi) విచారణలో భాగంగా, తన ఆర్థిక నేపథ్యాన్ని కూడా వెల్లడించాడు. ఇప్పటికే రవి దాదాపు లక్ష డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.80 లక్షలు) ఖర్చుపెట్టి కరేబియన్ దీవులలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని పొందినట్లు గుర్తించారు. ఇప్పటివరకు తాను సంపాదించిన సుమారు రూ.20 కోట్ల రూపాయల్లో, ఏకంగా రూ.17 కోట్లు కేవలం విలాసవంతమైన జీవితాన్ని, ఎంజాయ్‌మెంట్ కోసమే ఖర్చు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇకపై కూడా అదే విధంగా బతుకుతూ, వారానికో దేశం తిరుగుతూ జీవితాన్ని ఆస్వాదిస్తానని రవి విచారణలో స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ మొత్తం వ్యవహారం రవి యొక్క అసాధారణ టాలెంట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు , విలాసవంతమైన జీవనశైలిని మాత్రమే కాక, అతని నిరాడంబరమైన వంటల వ్యాపార ప్రణాళికను కూడా తెలియజేస్తుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version