Telangana : కోమటిరెడ్డికి కోపం వచ్చింది..

Telangana : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు కొత్తవి కావు.

Telangana : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపం మరోసారి బయటపడింది. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తే కీలక కార్యక్రమం కోసం వెళ్లే మార్గంలో చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహానికి, ఇతర మంత్రిపై అలగడానికి దారితీసింది.

Telangana

మంగళవారం ఉదయం, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నాగార్జున సాగర్‌కు హెలికాప్టర్‌లో బయల్దేరాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటలు దాటినా అక్కడికి చేరుకోలేదు.

తమను ఉదయం 9 గంటలకే రమ్మని చెప్పి, ఇంతసేపు ఆలస్యం చేయడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకెంతసేపు ఆగాలంటూ ఆగ్రహంతో ఊగిపోయి, అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి నాగార్జున సాగర్‌కు బయల్దేరి, గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ పరిణామాల మధ్య, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన రెండు ఫోన్‌లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు కొత్తవి కావు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వీరిద్దరూ సీనియర్ నాయకులే. గతంలో టీపీసీసీ అధ్యక్ష పదవి, ఇతర కీలక బాధ్యతల విషయంలో వీరి మధ్య అంతర్గత పోరు ఉండేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా, కోమటిరెడ్డి తన అసంతృప్తిని అనేక సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు. ఈ ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా కూడా.. రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారనేది పార్టీ వర్గాల్లో టాక్. ఇప్పుడు నాగార్జున సాగర్ ఘటన వారి మధ్య ఉన్న పాత విభేదాలను మళ్లీ బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Exit mobile version