Speaker:స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అసలు వివాదం ఏంటి?
Speaker: సాధారణంగా అసెంబ్లీ లోపల స్పీకర్ తీసుకునే నిర్ణయాలు కానీ సభ నిర్వహణ విషయంలో కానీ కోర్టులు జోక్యం చేసుకోవు.
Speaker
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న పార్టీ ఫిరాయింపుల మలుపు.. ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్(Speaker) గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో అసలు ఒక స్పీకర్‌కు కోర్టు నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న బలమైన కారణాలు,దీని పర్యవసానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ , బీజేపీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ.
దీనికోసం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మూడు నెలలలోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం చెప్పాలని కోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. కానీ, ఆ గడువు ముగిసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే (Contempt of Court) అని మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ఇప్పటికే కేటీఆర్, కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లతో సుప్రీంకోర్టు జత చేస్తూ ఫిబ్రవరి 6కు విచారణను వాయిదా వేసింది.
సాధారణంగా అసెంబ్లీ లోపల స్పీకర్ తీసుకునే నిర్ణయాలు కానీ సభ నిర్వహణ విషయంలో కానీ కోర్టులు జోక్యం చేసుకోవు. అయితే పదో షెడ్యూల్ (Anti-Defection Law) ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో.. స్పీకర్ ఒక ‘ట్రిబ్యునల్’ (న్యాయమూర్తి) లాగా వ్యవహరించాలి. ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఆయన కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు గతంలో ‘కిహోటో హొల్లోహన్’ , ‘మణిపూర్ స్పీకర్’ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం.. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. కోర్టు ఇచ్చిన గడువును పాటించకపోవడం వల్ల.. ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్‌కు సమాధానం చెప్పాలని నోటీసులు వచ్చాయి.
పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్లపై వివిధ కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారేం కాదు. గతంలో మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టు చాలా కఠినంగా వ్యవహరించింది. అక్కడ కూడా ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంతో, ఏకంగా ఆ ఎమ్మెల్యేను మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు సభకు హాజరుకాకుండా కూడా కోర్టు ఆంక్షలు విధించింది.

అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ విషయంలో కూడా సుప్రీంకోర్టు గడువు విధించి, నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే, చట్టసభల స్పీకర్లకు విశేష అధికారాలు ఉన్నా కూడా అవి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలకు లోబడి ఉండాలని కోర్టులు చెబుతున్నాయి.
దీంతో ఫిబ్రవరి 6న జరగబోయే విచారణ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. స్పీకర్(Speaker) నుంచి వచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు నేరుగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే, తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఇది రాష్ట్ర ప్రభుత్వ మనుగడపై ప్రభావం చూపకపోయినా కూడా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారుతుంది. విపక్షాలు మాత్రం స్పీకర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శిస్తుండగా, అధికార పక్షం మాత్రం ఇది స్పీకర్ పరిధిలోని అంశమేనని వాదిస్తోంది. ఈ పోరాటం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
Harish Rao:హరీశ్ రావుకు సిట్ నోటీసులు..ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకున్నట్లేనా?



