Sharmila, Kavita: జగనన్న చెల్లికి అన్యాయం చేశాడన్నారు. కవితక్కకు పదవి ఇవ్వరా మరి అన్నారు. ఇప్పుడేమో ఇంట్లోనే శత్రువులు అంటున్నారు. చెల్లెళ్లు ఇద్దరూ అన్నలిద్దరినీ ఇబ్బంది పెడుతున్నారని మార్చేశారు. షర్మిలకు అన్యాయమనేది పోయి.. జగన్ కు చెల్లి పోరు అని మార్చేశారు. అంతా కేటీఆరేనా అన్న దగ్గర నుంచి.. పాపం కేటీఆర్ కు కవితతో పోరు అని ట్యూన్ మార్చేశారు. అసలు ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది? అసలు మొదటి తప్పు అన్నాచెల్లెళ్లలో ఎవరిది? ఈ సమాధానం తెలుసుకునే ముందు మనం కాస్త సమాజ పరిణామక్రమం తెలుసుకోవాలేమో.
Sharmila, Kavita
మొదట్లో ఆడవాళ్లు నోరు మెదపకూడదు.. కాలు గడప దాటకూడదనేవారు. తర్వాత చదువుకోనిచ్చారు. ఆ తర్వాత కూడా సర్దుకుపోవడమే ఆడవాళ్ల పని. కెరీర్ మగవాళ్లకు ఇంపార్టెంట్.. వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడమే మహిళల వంతు అన్నట్లు నడిచింది. రాజకీయాల్లోనూ అదే తంతు. ఏదైనా మగవాళ్లే.. ఆడవాళ్లు అయినా వారి ముందుండి మగవాడే నడిపిస్తాడు. ఆత్మాభిమానం లాంటివి వదిలేసుకోవాల్సిందే. పెళ్లి అయ్యాక నచ్చినా, నచ్చకపోయినా.. అతనే భర్త . మరో మాట ఉండకూడదు. కాని టైమ్ మారింది.. ట్రెండ్స్ మారాయి. అదేదో యాడ్ లో వై షుడ్ బాయ్స్ హావ్ ఫన్ అన్న దగ్గర నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు.
నేనేంటి, నాకేంటి అనేది మొదలైంది. వాడేం చేసినా నేను పడుండాల్సిందేనా అన్న దగ్గర నుంచి ఏం చేసైనా నేను బాగుపడాలనే కాన్సెప్ట్ వచ్చేసింది. ట్యాలెంట్ ఉంటే ఏ రంగంలోనైనా మగవాళ్లతో పోటీ పడే స్థాయి ఆడవాళ్లకు ఉందని అందరికీ అర్ధమైపోయింది. అందుకే కెరీర్ లో సైతం కాంపిటీషన్ వచ్చేసింది. అందులో భాగమే ఈ పరిణామాలన్నీ. ఇక్కడ షర్మిల, కవిత కేరెక్టర్ల గురించి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు.. కాని వారి యాటిట్యూడ్, అప్రోచ్ గురించి మాత్రం మాట్లాడుకోవాల్సిందే. ముందు షర్మిల కథ చూద్దాం.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy )కూతురు. మొదట్లోనే ఇష్టం లేని పెళ్లి చేసినా.. తాను కోరుకున్నవాడినే పట్టుబట్టి పెళ్లి చేసుకుంది షర్మిల(Sharmila). అక్కడే తన యాటిట్యూడ్ బయటపడింది. ఇక తండ్రి చనిపోయాక.. జగనే అంతా అనుకున్న సమయంలో అనుకోని విధంగా సీబీఐ దెబ్బకు జైలుకు వెళ్లాడు. అప్పుడే షర్మిల అవసరం కనపడింది జగన్ కు. అన్న కోసం పాదయాత్ర చేసింది. జగనన్న వదిలిన బాణం అంటూ రామ్ రాసిన మాట నిజం చేసింది. తల్లిని వెంటేసుకుని తిరిగింది. కాని అంత చేసినా.. బెయిల్ పై జగన్ బయటికి రాగానే పక్కన పెట్టేశాడు. కనీసం ఒక పదవి కూడా ఇవ్వలేదు. అయినా ఎన్నికల్లో అన్న గెలుపు కోసం పని చేసింది. ఆ తర్వాత కూడా అధికారం వచ్చినా.. ఏ పదవీ ఇవ్వలేదు. దీంతో అన్న సంగతి అర్ధమైన చెల్లి .. తన వాటా తనకు ఇచ్చేయమంది. వాటాల లెక్కలేసేటప్పుడే జగన్, షర్మిల ఇద్దరి యాటిట్యూడ్లు ఒకరికొకరికి అర్ధమయ్యాయి. ఇక తప్పక తెలంగాణ వచ్చినా ఫెయిల్యూర్ తప్పలేదు. అనుకోని ఛాన్స్ గా కాంగ్రెస్ పదవి వస్తే.. ఏపీకి వచ్చి తనకు అన్యాయం చేసిన అన్నపై పగ తీర్చుకుంది.
ఇక కవిత( Kavita) కూడా అంతే. జాగృతి పేరుతో అన్నతో సమానంగా ఉద్యమంలో పాల్గొంది. అసలు కేటీఆర్, కవిత కన్నా హరీష్ రావు పాత్ర ఎక్కువ. అది వేరే విషయం. ఇక అధికారం వచ్చాక కేటీఆర్, కవిత ఇద్దరూ చక్రం తిప్పారు. అయితే కేటీఆర్ కాస్త స్పీడుగా వెళ్లి అన్నిటిలోనూ దూరిపోయాడు. ఇక కేసీఆర్ తర్వాత కేటీఆరే అనిపించేసుకున్నాడు. ఇక్కడే కవితకు మండింది. కేవలం జెండర్ తేడా వల్లనే కేటీఆర్ అలా చేయగలిగాడు తప్ప.. అన్న కంటే తానేం తక్కువ అనుకుంది. అంతలోనే లిక్కర్ స్కామ్ లో చిక్కుకోవడంతో మరింత దెబ్బ తగిలింది. తాను జైలుకు వెళ్లా.. కేటీఆర్ వెళ్లలేదు.. కాని తన కంటే ఎక్కువ అవినీతే చేశాడుగా అనేది కవిత భావన అనే ప్రచారం ఉంది. అందుకే తనకు పదవి ఎందుకు ఇవ్వరు.. తానేం తక్కువ అనే యాంగిల్ నుంచి ఫైట్ మొదలెట్టి.. ఇప్పుడు నడుస్తున్న పోరు దాకా వచ్చింది.
వీళ్లిద్దరి కథలోనూ ఒకటే కామన్. మేల్ డామినేషన్ ఫ్యాక్టర్. కేవలం ఆడవారు కావడం వలన తాము తక్కువ కావడానికి వాళ్లిద్దరూ ఒప్పుకోలేదు. ఆ కారణంతోనే తమకు వాటాలు తగ్గడాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. మారిన ట్రెండ్ కు అనుగుణంగానే చెల్లెళ్లు ఇద్దరూ.. అన్న అయితే ఏంటి అంటూ వారిపైనే ఫైటింగ్ కు దిగారు. అదే నడుస్తుంది ఇప్పుడు. అదే వై నాట్ లేడీస్..?