Anti-aging Vaccine
ప్రతి మనిషి జీవితంలో వృద్ధాప్యం అనేది తప్పనిసరి. అయినా సరే, ‘ఎప్పటికీ యవ్వనంగా ఉంటే ఎంత బాగుండు’ అనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎందుకంటే, వయసు పెరిగే కొద్దీ చర్మ కాంతి తగ్గిపోవడం, ఉత్సాహం నీరుగారిపోవడం, ఆపై అనేక ఆరోగ్య సమస్యలు శరీరాన్ని చుట్టుముట్టడం మొదలవుతుంది. ఈ సహజ సిద్ధమైన ప్రక్రియను ఆపడానికి(Anti-aging Vaccine) ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అనేక పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాలలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, మయామి నగరానికి చెందిన ‘ఇమ్మోర్టా బయో’ (Immorta Bio) అనే బయోటెక్నాలజీ సంస్థ శాస్త్రవేత్తలు వృద్ధాప్యాన్ని అడ్డుకునే శక్తివంతమైన ఒక వ్యాక్సిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. దీనికి వారు పెట్టిన పేరు సెనోవాక్స్ (SenoVax-Anti-aging Vaccine ).
ఈ సంచలన ప్రకటన (Anti-aging Vaccine)సోషల్ మీడియాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది. ఇమ్మోర్టా బయో శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, సెనోవాక్స్ కేవలం వృద్ధాప్య లక్షణాలను నిరోధించడమే కాక, మానవుల జీవితకాలాన్ని రెట్టింపు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.
సెనోవాక్స్ పనిచేసే విధానం ఏమిటి అంటే..ఈ వ్యాక్సిన్ యొక్క ప్రధాన లక్ష్యం సెనెసెంట్ సెల్స్ (Senescent Cells), అంటే వృద్ధాప్య కణాలు. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలోని కణాలు దెబ్బతిని, పనిచేయకుండా పోయినా, చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఈ కణాలనే సెనెసెంట్ సెల్స్ అంటారు.
ఇవి ఆరోగ్యవంతమైన చుట్టుపక్కల కణాలను కూడా పాడుచేస్తూ, శరీరంలో వాపు (inflammation)ను పెంచుతాయి. ఈ వాపు, లేదా దీర్ఘకాలిక మంట (Chronic Inflammation) వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించడానికి, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ప్రధాన కారణంగా మారుతుంది.
సెనోవాక్స్ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించగానే, రోగనిరోధక వ్యవస్థను సరిదిద్దడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించడం ప్రారంభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇస్తుంది: వృద్ధాప్యానికి కారణమవుతున్న ఈ సెనెసెంట్ కణాలను శత్రువులుగా గుర్తించి, వాటిని వెతికి నాశనం చేయడానికి (elimination) సహాయపడుతుంది.
వృద్ధాప్య కణాలు తొలగిపోవడం వల్ల, శరీరంలో దీర్ఘకాలిక మంట తగ్గుతుంది. ఫలితంగా, వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా, శరీర ఉత్సాహం, పునరుద్ధరణ సామర్థ్యం పెరుగుతుంది.
సెనోవాక్స్ కేవలం వృద్ధాప్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపైనా పోరాడటానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రీక్లినికల్ (జంతువులపై) పరీక్షల్లో ఈ వ్యాక్సిన్..క్యాన్సర్ ట్యూమర్ల పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంది.క్యాన్సర్ కణాలకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని బలహీనపరిచింది.
మరింత ఆశ్చర్యకరంగా, జంతువులపై చేసిన ప్రయోగాలలో వాటి జీవితకాలాన్ని 100% కంటే ఎక్కువగా పెంచింది. ఈ అద్భుతమైన ఫలితాలతో, ఇమ్మోర్టా బయో శాస్త్రవేత్తలు ఇప్పటికే అంతర్జాతీయ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో మానవులపై క్లినికల్ ట్రయల్స్ (పరీక్షలు) ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మానవులపై చేయబోయే క్లినికల్ ట్రయల్స్‌లో మరింత ఆశాజనకమైన ఫలితాలు సాధించడానికి, శాస్త్రవేత్తలు సెనోవాక్స్‌ను కేవలం విడిగా కాకుండా, స్టెమ్‌సెల్ రివైవ్ (StemCellRevivify) థెరపీతో కలిపి ఉపయోగించాలని యోచిస్తున్నారు.
స్టెమ్‌సెల్స్ (మూలకణాలు) శరీరంలో కొత్త కణాలను ఉత్పత్తి చేయగల, దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. సెనోవాక్స్ పాత, దెబ్బతిన్న వృద్ధాప్య కణాలను తొలగించి, మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆ తర్వాత, యంగ్ స్టెమ్ సెల్స్‌ను ఉపయోగించి శరీరాన్ని పునరుజ్జీవింపజేయడం (Revitalize) ద్వారా కణాల్లోని గాయాలు మానే సామర్థ్యం పెరుగుతుంది. ఈ సంయుక్త చికిత్స ద్వారా వృద్ధాప్యాన్ని జయించే అద్భుతం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు.
మానవులపై ఈ ప్రయోగాలు విజయవంతం అయితే గనుక, ప్రపంచ వైద్య చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
