Ariselu: సంక్రాంతి అరిసెలు గట్టిగా వస్తున్నాయా? ఈ రెసిపీ సీక్రెట్స్ మీకోసమే!

Ariselu: అరిసెల తయారీలో బియ్యం ఎంపిక చేయడమే మొదటి మెట్టు. మీరు ఒకవేళ పాత బియ్యం వాడితే అరిసెలు కచ్చితంగా గట్టిగా వస్తాయి.

Ariselu

తెలుగు వారి ఇళ్లలో సంక్రాంతి వచ్చిందంటే అరిసెల (Ariselu)వాసన ఘుమఘుమలాడాల్సిందే. కానీ అరిసెలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అరిసెలు చేయడం అనేది ఒక ప్రత్యేకమైన కళ. చాలామంది అరిసెలు చేసేటప్పుడు అవి గట్టిగా అయిపోతుంటాయి లేదా నూనెలో వేయగానే విడిపోతుంటాయి.

ఇలా కాకుండా అరిసెలు ఎప్పుడూ మెత్తగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండాలంటే మాత్రం ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు అవసరం. అరిసెల తయారీలో బియ్యం ఎంపిక చేయడమే మొదటి మెట్టు. మీరు ఒకవేళ పాత బియ్యం వాడితే అరిసెలు కచ్చితంగా గట్టిగా వస్తాయి.

అందుకే అరిసెల(Ariselu) కోసం ఎప్పుడూ కొత్త బియ్యాన్నే వాడాలి. బియ్యాన్ని కనీసం 24 నుంచి 36 గంటల పాటు నానబెట్టాలి. మధ్యమధ్యలో ప్రతి 6 గంటలకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి, లేకపోతే పిండి వాసన వచ్చేస్తుంది.

బియ్యాన్ని వడపోసి, పట్టుకుంటే తడి ఉండగానే మిల్లు పట్టించాలి. ఆ తడి పిండిని వెంటనే మందపాటి గిన్నెలో వేసి అది ఆరిపోకుండా అదిమి పెట్టాలి. పిండిలో చెమ్మ ఉంటేనే అరిసెలు మెత్తగా వస్తాయి.

ariselu

ఇక రెండో ముఖ్యమైన విషయం అరిసెలకు తగిన పాకం పట్టడం. అరిసెలకు ఎప్పుడూ తాటి బెల్లం కానీ నాణ్యమైన బెల్లం కానీ వాడాలి. పాకం పట్టేటప్పుడు అందులో అర కప్పు నీళ్లు పోసి కరిగించి వడకడితే నలకలు పోతాయి. ఆ తర్వాత పాకాన్ని నీళ్లలో వేసినప్పుడు అది గట్టి పడకుండా, చేత్తో తీస్తే మెత్తని ఉండలా రావాలి. ఈ సమయంలోనే స్టవ్ కట్టేసి, అందులో 5 చెంచాల నెయ్యి, యాలకుల పొడి, కొంచెం పాలు కలిపితే అరిసెలు చాలా సాఫ్ట్ గా వస్తాయి.

పిండిని పాకంలో కలిపేటప్పుడు ఒక్కసారే పోయకుండా, ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకరు కలుపుతూ మరొకరు పిండి పోస్తూ ఉండాలి. పిండి కలిపిన తర్వాత పైన కొంచెం నెయ్యి రాసి మూత పెట్టేయాలి.

అరిసెలు (Ariselu)ఒత్తేటప్పుడు మరీ పల్చగా ఒత్తకూడదు, మరీ దళసరిగా ఒత్తకూడదు. నూనె మరీ వేడిగా ఉండకూడదు, అలాగని తక్కువ వేడి ఉండకూడదు. మధ్యస్థ వేడి మీద అరిసెను వేసి అది పైకి తేలగానే తీసేయాలి. అరిసెను తీసిన వెంటనే గరిటెతో మరీ గట్టిగా నొక్కకూడదు. కేవలం వాటికున్న ఎక్స్‌ట్రా నూనె పోయే వరకు లైట్ గా నొక్కితే సరిపోతుంది. ఇలా చేసిన అరిసెలు చల్లారిన తర్వాత కూడా గట్టి పడవు. ఈ పద్ధతి పాటిస్తే మీ ఇంటి అరిసెలు ఊరంతా ఫేమస్ అవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version