Electric Cycle:రూ. 5000 చెల్లిస్తే ఎలక్ట్రిక్ సైకిల్ సొంతం.. సచివాలయాల్లో దరఖాస్తులు
Electric Cycle: ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కావాలనుకునే వారు సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి.
Electric Cycle
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు సామాన్యులకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. కేవలం రూ. 5000 ప్రాథమిక చెల్లింపు (Down Payment) చేస్తే చాలు, ఎలక్ట్రిక్ సైకిల్(Electric Cycle)ను వెంటనే మీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా తన నియోజకవర్గమైన కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మొదటి విడతలో కుప్పంలో 5,000 సైకిళ్లు, కృష్ణా జిల్లాలో 500 సైకిళ్లు పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అసలు విలువ దాదాపు రూ. 23,999 ఉంటుంది. అయితే లబ్ధిదారులు ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించవలసిన అవసరం లేదు.
డౌన్ పేమెంట్ రూ. 5,000 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా లోన్ సౌకర్యం కల్పిస్తుంది. మిగిలిన డబ్బులను నెలకు సుమారు రూ. 800 నుంచి రూ. 1,00 0 లోపు ఈజీ ఇన్స్టాల్మెంట్లలో (24 నెలల పాటు) చెల్లించుకునే వెసులుబాటు ఉంది.

ఈ సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. దీనికి కేవలం ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది (సుమారు రూ. 7 నుంచి 10 లోపు). పెట్రోల్ ఖర్చు ఉండదు కాబట్టి సామాన్యులకు, విద్యార్థులకు , చిరు వ్యాపారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కావాలనుకునే వారు సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర పేరు నమోదు చేసుకోవాలి. దరఖాస్తుకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ , బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరమవుతాయి. ఎంపికైన లబ్ధిదారులకు వారికి కేటాయించిన తేదీల్లో ప్రభుత్వం సైకిళ్లను పంపిణీ చేస్తుంది.
Railway:రైల్వే ప్రయాణికులకు తిప్పలు.. ఏ రూట్లో, ఎందుకు, ప్రత్యామ్యాయ రూట్ ఏంటి?



