Vande Bharat
ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రైలు సర్వీస్‌గా వందేభారత్(Vande Bharat) ఎక్స్‌ప్రెస్ నిలుస్తోంది. దేశవ్యాప్తంగా వందేభారత్‌కు లభిస్తున్న అద్భుతమైన స్పందనను గమనించిన రైల్వే బోర్డు, తాజాగా మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ఏడు ప్రముఖ మార్గాలలో నడిచే వందేభారత్ రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో (జులై 31, 2025 నాటికి) రైళ్లలో ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో ముఖ్యంగా సికింద్రాబాద్-తిరుపతి మార్గంతో పాటు, మంగళూరు సెంట్రల్-తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి, మదురై-బెంగళూరు కంటోన్మెంట్, దేవ్‌గఢ్-వారణాసి, హౌరా-రౌర్కెలా, ఇండోర్-నాగ్‌పూర్ మార్గాల్లో కూడా కోచ్‌ల సంఖ్యను పెంచనున్నారు.
ప్రస్తుతం మూడు మార్గాల్లో 16 కోచ్‌లు, నాలుగు మార్గాల్లో 8 కోచ్‌ల రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్పుల తర్వాత, 16 కోచ్‌ల రైళ్లను 20 కోచ్‌లకు, 8 కోచ్‌ల రైళ్లను 16 కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ పెంపుతో ప్రయాణికులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్పుల వల్ల సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో నడుస్తున్న రైలు 16 నుంచి 20 కోచ్‌లకు పెరగనుంది.
ఈ ఏడు మార్గాల్లో కోచ్‌ల అప్‌గ్రేడ్‌తో పాటు, మరిన్ని కొత్త 16, 8 కోచ్‌ల వందేభారత్( Vande Bharat) రైళ్లను కూడా కొత్త మార్గాలలో ప్రవేశపెట్టేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే రైల్వేల లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది. వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఇది ఒక కీలకమైన చర్యగా చెప్పొచ్చు.