Suryakumar Yadav
క్రికెట్ లో టీమ్ విజయాలు సాధిస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది.. విజయాల హడావుడిలో లోపాలు పెద్దగా కనబడవు. అలాగే కీలక ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా పెద్దగా చర్చకు రాదు. కానీ ఎప్పుడైతే ఓటములు పలకరిస్తుంటాయో అప్పుడు ఖచ్చితంగా అవి గుర్తుకొస్తాయి. ఒక్కోసారి జట్టు గెలుపు బాటలో ఉన్నా కూడా కీ ప్లేయర్స్ ప్రదర్శనపై చర్చ జరుగుతుంటుంది. ప్రస్తుతం భారత టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ది ఇదే పరిస్థితి.
పొట్టి క్రికెట్ లో మెరుపులకు కేరాఫ్ అడ్రస్ గా, మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్యాభాయ్ (Suryakumar Yadav)బ్యాట్ మూగబోయింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో పరుగులు చేసేందుకు కూడా స్కై తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. సూర్యకుమార్ నుంచి అంతర్జాతీయ టీ ట్వంటీల్లో మెరుపులు చూసి ఏడాది పైనే అయిపోయింది.
భారత జట్టు టీ20జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించిన తర్వాత సూర్య బ్యాటింగ్ లో విఫలమవుతున్నాడు. నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఒకప్పుడు అతని బ్యాటింగ్ లో మెరుపులు ఇప్పుడు కనిపించడం లేదు. అలవోకగా సిక్సర్లు బాదేసే సూర్యకుమార్ (Suryakumar Yadav)ఇప్పుడు సింగిల్ డిజిట్స్ కే పరిమితమవుతున్నాడు.
ఆసియా కప్ లో ఘోరంగా విఫలమైన స్కై ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లోనూ తన పేలవ ఫామ్ తో నిరాశపరిచాడు. ఈ ఏడాది సూర్యకుమార్ కెరీర్ లో అత్యంత దారుణమైన ఇయర్ గా చెప్పొచ్చు. ఒక్క చెప్పుకోదగిన ఇన్నింగ్స్ కూడా లేదు. అతను ఆడిన 16 ఇన్నింగ్స్ ల్లో ఒక్క కూడా హాఫ్ సెంచరీ కూడా లేదంటే సూర్య ఎంతటి పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ 16 ఇన్నింగ్స్ లో మూడు డకౌట్ లు , ఐదు సార్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు.
అతని సగటు మరీ ఘోరంగా 15 మాత్రమే ఉంది. టెయిలెండర్ల సగటు తరహాలో స్కై యావరేజ్ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్ లో సూర్య మంచి ఫామ్ కనబరిచాడు. ముంబై ఇండియన్స్ తరపున అరుదైన రికార్డ్ కూడా సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో వరుసగా 14 సార్లు 25 ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు.
ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన సూర్య అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం వైఫల్యాల బాట వీడడం లేదు. టీ20 వరల్డ్ కప్ ముందు సూర్య ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యం. పైగా ప్రస్తుత సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు మినహాయిస్తే వరల్డ్ కప్ కు ముందు కివీస్ తో జరిగే ఐదు టీట్వంటీలే మిగలనున్నాయి. దీంతో ఈ రెండు సిరీస్ లోనైనా సూర్యకుమార్ గాడిన పడకుంటే మెగాటోర్నీకి ముందు అతని కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుుంది.
