Chicken Biryani
బిర్యానీ పేరు చెప్పగానే చాలా మంది నాన్ వెజ్ ప్రియులు చికెన్ బిర్యానీకే ఓటేస్తారు. అయితే చికెన్ బిర్యానీలో దమ్ బిర్యానీ అంటే మరి కొంతమంది బాగా ఇష్టపడతారు. అయితే చికెన్ బిర్యానీ (Chicken Biryani) అన్నా, చికెన్ దమ్ బిర్యానీ అన్నా ఒకటే అనుకుంటారు. కానీ వీటిని తయారుచేసే విధానంలో, రుచిలో , సువాసనలో చాలా తేడా ఉంటుంది.
దమ్ బిర్యానీలో అయితే చికెన్‌ను ముందుగా మసాలాలతో మ్యారినేట్ చేసి పక్కన పెడతారు. తర్వాత ఒక పాత్రలో ఆయిల్ వేసి దానిలో మ్యారినేట్ చేసిన చికెన్‌ను, దానిపై సగం ఉడికించిన అన్నాన్ని వేసి, గిన్నె మూతను గోధుమ పిండితో సీల్ చేసి ఉడికిస్తారు. దీనివల్ల మాంసం, అన్నం ఆవిరిలోనే నెమ్మదిగా ఉడికి, మసాలా వాసనలు అన్నానికి బాగా పడతాయి.
సాధారణ చికెన్ బిర్యానీ (Chicken Biryani)లో మాంసాన్ని ముందుగా విడిగా వండుకుని, ఆ తర్వాత రైస్‌తో కలిపి దమ్ పెడతారు లేదా కుక్కర్‌లో కలిపి వండుతారు.
ముందుగా దమ్ బిర్యానీ చేయాలనుకుంటే చికెన్ (అర కిలో), బాస్మతి బియ్యం (అర కిలో), పెరుగు , అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, బిర్యానీ మసాలా, నెయ్యి, నూనె, నిమ్మరసం ,హోల్ గరం మసాలా.
ముందుగా చికెన్‌ను కడిగి పెరుగు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నూనె , నిమ్మరసం కలిపి కనీసం 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మరో పక్క బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టి, మరుగుతున్న నీటిలో గరం మసాలాలు వేసి బియ్యాన్ని డెబ్బై శాతం వరకు ఉడికించి వార్చుకోవాలి.
ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో మ్యారినేట్ చేసిన చికెన్‌ను పరిచి, దానిపై ఉడికించిన అన్నాన్ని ఒక పొరలా వేయాలి. అన్నం పైన పుదీనా, కొత్తిమీర, నెయ్యి , కుంకుమపువ్వు నీళ్లు చల్లాలి. గిన్నె మూత చుట్టూ గోధుమ పిండి పెట్టి గాలి బయటకు పోకుండా సీల్ చేయాలి. మొదట 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, ఆ తర్వాత 20 నిమిషాలు సిమ్‌లో ఉడికిస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది.
స్పెషల్ చికెన్ బిర్యానీకి చికెన్ (అర కిలో), బాస్మతి బియ్యం (అర కిలో), ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నూనె, నెయ్యి.
ఈ పద్ధతిలో ముందుగా చికెన్‌ను కడిగి ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని విడిగా పొడిపొడిగా వండుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. దానిలో చికెన్ ముక్కలు వేసి తగినంత నీళ్లు పోసి ముక్క మెత్తబడే వరకు గ్రేవీలా వండుకోవాలి.
చికెన్ కర్రీ రెడీ అయ్యాక, ఒక పెద్ద గిన్నెలో ముందుగా వండుకున్న రైస్‌ను, చికెన్ గ్రేవీని పొరలు పొరలుగా వేసి, పైన కొత్తిమీర, నెయ్యి చల్లి మూత పెట్టి కేవలం 5 – 10 నిమిషాలు తక్కువ మంటపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్నం విడిపోకుండా ఉంటుంది . చికెన్ ముక్కలు చాలా జ్యూసీగా ఉంటాయి.
