Kind People
సొసైటీలో ఎవరికైనా కష్టం వస్తే ముందుండి సహాయం చేసే గుణమున్నవారే ఎక్కువగా మోసపోతుండటం మనం చూస్తూనే ఉంటాం. అందుకే చాలామంది మంచితనానికి రోజులు లేవని బాధపడుతుంటారు. సైకాలజీ ప్రకారం ఇలాంటి వాళ్లు మోసపోవడానికి మెయిన్ రీజన్ వారిలో ఉండే మితిమీరిన సానుభూతేనట. దీనిని మానసిక శాస్త్రంలో హైపర్ ఎంపతీ లేదా పీపుల్ ప్లీజర్(Kind People) మెంటాలిటీ అని పిలుస్తారు.
అంటే, ఎదుటివారు చెప్పే అబద్ధాలను కూడా నిజమేనని నమ్ముతూ, వారి బాధను తమ బాధగానే ఫీల్ అవుతుంటారు. ఎవరైనా సాయం అడిగినప్పుడు కాదనలేకపోవడం, నో అని చెప్పడానికి కూడా మొహమాటపడటం వీళ్ల వీక్‌నెస్‌గా మారుతుంది. దీనివల్ల స్వార్థపరులైన వ్యక్తులు ఇలాంటి వారి అమాయకత్వాన్ని ఈజీగా పసిగట్టి, వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తుంటారు.
సాయం చేసే వ్యక్తులు అందరూ కూడా తమలాగే మంచివాళ్లు అనుకోవడమే ఇంకొక పెద్ద పొరపాటు. సైకాలజీలో దీనిని ప్రొజెక్షన్ బయాస్ అంటారు. అంటే మనం ఎవరికీ అపకారం, హానీ చేయం కాబట్టి మనకు కూడా ఎవరూ అన్యాయం చేయరనే ఒక గుడ్డి నమ్మకంతో వీళ్లు ఉంటారు.
అయితే ఈ నమ్మకమే వాళ్లను చాలా సమయాల్లో ప్రమాదంలోకి నెడుతుంది. కొంతమంది కేవలం తమ పనులు ముగించుకోవడానికి మాత్రమే సాయం అడుగుతూ తమను వాడుకుంటున్నారనే నిజాన్ని వీళ్లు గ్రహించలేరు. చివరికి మోసపోయిన తర్వాత మానసిక వేదనకు గురవుతారు. మనుషులపై నమ్మకం కోల్పోయి, అందరినీ అనుమానించే పరిస్థితిని తెచ్చుకుంటారు.
మంచితనం ఉండటం తప్పు కాదు. అయితే దానికి కచ్చితంగా ఒక హద్దు ఉండాలి. ఎవరికైనా సాయం చేసే ముందు అవతలి వ్యక్తి(Kind People) నిజాయితీని, వారి గత ప్రవర్తనను ఒక్కసారి గమనించాలి. మనకు సాధ్యమైనంత వరకే సాయం చేయాలి తప్ప, మనల్ని మనం ఇబ్బందుల్లో పడేసుకుని మరీ ఎదుటివారికి తోడ్పడకూడదు. ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలామంది పొరపాటు చేస్తుంటారు.
మన మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారని అనిపిస్తే మాత్రం, మొహమాటం లేకుండా వారికి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. సొసైటీలో బతకాలంటే కేవలం మంచి మనసుంటే సరిపోదు, దాంతో పాటు కాస్త లోకజ్ఞానం, వివేకం కూడా ఉండాలి. మన బౌండరీస్ మనకు తెలిసినపుడే మన మంచితనం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది . అలాగే మనల్ని మనం మోసపోకుండా కాపాడుకోగలుగుతాం.
